ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలకు మోగిన నగారా
ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలకు మోగిన నగారా
Published Mon, Nov 21 2016 10:33 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
డిసెంబర్ 16న క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు
– 2 నుంచి నామినేషన్లు.. ఉపసంహరణకు 13న అవకాశం
– 12 డిపోల్లో 17 డెలిగేట్ పోస్టులు
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థలో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికల నిర్వహణకు నగారా మోగింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సొమ్మును దాచుకోవడంతో పాటు రుణాలు పొందే వీలుతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల కాలపరిమితి డిసెంబర్ 16వ తేదీన పూర్తి కానుండడంతో అదే రోజు కొత్త ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికైన డెలిగేట్లు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సొసైటీలో సభ్యులను చేర్పించడం, డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు ప్రక్రియను, ఉద్యోగుల సందేహాలను తీర్చడం, అవసరమైన సలహాలు ఇవ్వడం ప్రతినిధుల విధిగా ఉంటుంది. ఇదిలాఉంటే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత డిపో మేనేజర్లదేనని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.మధుసూదన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు.
నోటిఫికేషన్ ఇలా..
సీసీఎస్ ఎన్నికల నిర్వహణకు ఈనెల 16న నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖతో సంబంధం లేకుండా సంబంధిత డిపో మేనేజర్ ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. సభ్యులు, ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీలోపు తెలియజేయాలి. డిపోకు ఒక సీసీఎస్ ప్రతినిధి(డెలిగేట్) పోస్టు ఉంటుంది. పోటీ చేసేందుకు డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పోటీ చేసే వారిలో అనర్హులు ఉంటే 9న జాబితా విడుదల చేస్తారు. 13న ఉపసంహరణ(విత్‌డ్రా)కు అవకాశం ఉంటుంది. తుది జాబితాను అదే రోజు విడుదల చేస్తారు. 16వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తారు.
12డిపోలు.. 17 మంది డెలిగేట్లు
కర్నూలు రీజియన్(జిల్లా)లో 12 డిపోలు ఉండగా.. 17 డెలిగేట్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు–1 డిపోతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు–2 డిపోల్లో రెండేసి పోస్టులు ఉంటాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె, పత్తికొండ, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ డిపోలకు ఒక్కో పోస్టు ఉంటుంది. ఈ స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు రాష్ట్ర సొసైటీ డైరెక్టర్లను ఎంపిక చేసే వీలుంటుంది.
Advertisement