ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) పరిస్థితి దా’రుణం’గా తయారైంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారు, రిటైర్ అయి సెటిల్‌మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారు సీసీఎస్ కార్యాలయానికి వచ్చి అక్కడి సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. నిత్యం గొడవలు, వాడోపవాదాలతో సీసీఎస్ కార్యాలయం గందరగోళంగా తయారవుతోంది. సీసీఎస్‌కు ఆర్టీసీ దాదాపు రూ.650 కోట్లు బకాయిపడింది.
వడ్డీతో కలుపుకొంటే ఆ మొత్తం రూ.1050 కోట్లకు చేరింది. ఆ నిధులు సొంతానికి వినియోగించుకున్న ఆర్టీసీ, వాటిని చెల్లించేందుకు ససేమిరా అంటుండటంతో సీసీఎస్‌లో నిధులు లేకుండాపోయాయి. ఫలితంగా లోన్లకు దరఖాస్తు చేసి నెలలుగా ఎదురుచూస్తున్నవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రిటైర్ అయి నెలలు గడుస్తున్నా సెటిల్‌మెంట్లు చేయకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. ఇక పదవీ విరమణ పొంది, వారి సెటిల్‌మెంట్ డబ్బులను ఇందులో డిపాజిట్ చేసి వడ్డీ పొందలేకపోతున్న విశ్రాంత ఉద్యోగులూ ఆందోళనకు దిగుతున్నారు.
కోర్టు ఆదేశాలను కూడా..
ఇటీవలే ఆ నిధుల ఇప్పించాలని సీసీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే మొత్తాన్ని యథావిధిగా సీసీఎస్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలా చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.18 కోట్లు. ఆ నిధుల నుంచే సీసీఎస్ సభ్యులైన ఉద్యోగులకు రుణాలు అందిస్తారు. కానీ ఆర్టీసీ రూ.ఐదారు కోట్లకు మించి కట్టడం లేదు. దీంతో రుణాల కోసం దాదాపు ఏడు వేల దరఖాస్తులు పేరుకుపోయాయి. రూ.18 కోట్లను సీసీఎస్‌కు కట్టమని స్వయంగా హైకోర్టు చెప్పినా ఆర్టీసీ పట్టించుకోకపోవడంపై రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
ఎన్ని మార్లు తిరగాలి?
ఇక బకాయిలకు సంబంధించి ఈనెల 15 లోపు రూ.50 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 13వ తేదీ వచ్చినా, ఆర్టీసీ నుంచి ఇప్పటి వరకు సీసీఎస్‌కు పిలుపు అందలేదు. ఈనెలాఖరులోగా మరో రూ.150 కోట్లు కూడా చెల్లించాలని ఆదేశించింది. ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించుకునే సొమ్ములనే ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ బకాయిల చెల్లింపు విషయంలో ఎలా నమ్మకంగా ఉండగలమని ఓ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.
‘కూతురి పెళ్లి పెట్టుకున్నా సర్, లోన్ కోసం దరఖాస్తు చేసి మూడు నెలలైంది. చిన్న జీతమున్నోడిని, ప్రైవేటుగా అప్పు తెచ్చి వడ్డీ కట్టగలనా. నా పైసల మీద లోనే కదా నేను అడిగేది.. ఎందుకియ్యరు.?’ – సిద్దిపేట జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆవేదన ఇది.
‘రిటైర్ అయిన వెంటనే సెటిల్‌మెంట్ చేసి పంపుతామన్నరు. నేను రిటైర్ అయి మూడు నెలలైంది. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ఇంత తిప్పుతరా. మాలాంటోళ్ల బాధలు చూసి, బకాయిలు కట్టమని ఆర్టీసీకి కోర్టు చెప్పినా ఇవ్వకుంటే నాలోంటోళ్లు ఏం చేయగలుగుతరు’ –నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ శ్రామిక్ ఆవేదన ఇది.
Comments
Please login to add a commentAdd a comment