‘ఆర్టీసీ ఉద్యోగులు రుణం కోసం అందించే దరఖాస్తులను మీరు బ్యాంకులకు, రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఫార్వర్డ్ చేయొద్దు.. ఉద్యోగుల వేతన బిల్లుల నుంచి రుణ రికవరీలకు వీలు కల్పించవద్దు’ – ఇటీవల యూనిట్ అధికారులకు ఆర్టీసీ జారీ చేసిన ఆదేశం ఇది.
ఆర్టీసీ కార్మికులకు రుణం పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ ఆదేశం ఉద్యోగులకు అశనిపాతంగా మారింది. వాస్తవానికి ఇది కొత్త సర్క్యులర్ కాదు. 2003లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. పాత సర్క్యులర్‌ను కోట్ చేస్తూ దాన్ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేసేలా తాజాగా మరో సర్క్యులర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేశారు. కాగా, ఇప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదేశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకీ ఆదేశం.. ఏమిటా విపత్కర పరిస్థితి..
ఆర్టీసీ ఉద్యోగులు గతంలో స్వేచ్ఛగా బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. కొంతకాలం క్రితం వరకు వేతనాల ఖాతాలున్న బ్యాంకు వారికి రుణాలు ఇచ్చే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేది. ఇటీవలే వేతనాల ఖాతాలు మరో బ్యాంకుకు మార్చారు. రుణాలిచ్చే విషయంలో కొత్త బ్యాంకు రకరకాల కొర్రీలు, కఠిన నిబంధనలు పెడుతోందని, దీంతో రుణాలకు ఇబ్బందిగా మారిందని కార్మికులు పేర్కొంటున్నారు. దీంతో వేరే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు.
సాధారణంగా ఆర్టీసీ అధికారుల ద్వారా రుణ దరఖాస్తు వస్తే బ్యాంకులు సులభంగా రుణమిస్తాయి. ఒకవేళ కార్మికులు తిరిగి చెల్లించకున్నా, ఆర్టీసీ పూచీగా ఉంటుందన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది. ఇప్పుడు రుణాలకు సిఫారసు చేయొద్దని, వేతనాల నుంచి రికవరీకి బ్యాంకులకు అవకాశం ఇవ్వవద్దని పేర్కొంటూ పాత ఆదేశాలను తిరిగి తెరపైకి తేవడం విశేషం.
సీసీఎస్ దివాలాతో..
గతంలో ఆర్టీసీ కార్మికులకు బ్యాంకు రుణాల అంశం పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) సుభిక్షంగా ఉండటంతో దాని ద్వారానే కావాల్సిన రుణాలు పొందేవారు. కొంతకాలంగా దాని నిల్వ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని, దాదాపు వేయి కోట్లకుపైగా బకాయి (వడ్డీతో సహా) పడటం, నెలనెలా దానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ దాదాపు దివాలా దశకు చేరిన సంగతి తెలిసిందే.
దీంతో అక్కడి నుంచి రుణాలు నిలిచిపోవడం కార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే వీలు లేకపోవటంతో వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సమయానికి చెల్లించిన రికార్డు ఉన్న వారు పాత పరిచయాలతో రుణాలు పొందగలుగుతున్నా... మిగతా వారికి మాత్రం ఆర్టీసీ నుంచి సిఫారసు లేకుండా రుణం రాని పరిస్థితి నెలకొంది.
‘ఇదేం ఘోరం’
అటు సీసీఎస్‌ను నిర్విర్యం చేసి రుణాలు అందని పరిస్థితి తెచ్చి, ఇటు బ్యాంకుల నుంచి రుణ సిఫారసులు లేకుండా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్‌ను పునరుద్ధరించే దాకా బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా రుణాలు పొందే వీలు కల్పించాలని, తాజా సర్క్యులర్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment