బాన్సువాడరూరల్ : అతివృష్టి, అనావృష్టిలతో సాగు భారమవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలు, రైతు కుటుంబాలు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించి ఆర్థిక స్వావలంబన సాధించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
ఆదివారం ఆయన మండలంలోని పోచారం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి స్త్రీనిధి రుణంతో డ్వాక్రా మహిళలకు గేదెలు కొనుగోలు చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సాగుఖర్చులు పెరిగిన నేపథ్యంలో రైతులు నాబార్డు, ఐకేపీలు సంయుక్తంగా అందిస్తున్న రుణాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని పాడితో అధిక లాభాలు గడించాలన్నారు.
ఒక గేదెను పెంచడం ద్వారా అన్ని ఖర్చులు పోనూ నెలకు రూ. 8వేల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. తొలివిడతగా గ్రామంలోని డ్వాక్రా మహిళలకు ఒక గేదె ఇప్పిస్తున్నామని, రుణాల కిస్తులను ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే మరో గేదె ఇప్పించడం జరుగుతుందన్నారు. రూ. 40 వేల గేదెకు రూ. 10వేలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఉన్న ఇతర రాష్ట్రాల గేదెలు కొనుగోలు చేయాలనే నిబంధన తొలగించామన్నారు.
పోచారం గ్రామంలో కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అలాగే గొర్లపెంపకందారులకు రూ. లక్ష రుణంతో 20 గొర్రెలు ఒక పొటేలు అందజేస్తున్నామన్నారు. దీంట్లో రూ. 20 వేలు లబ్ధిదారు, రూ. 20 వేలు సబ్సిడీ, రూ. 60 వేలు ఎన్‌సీడీసీ ద్వారా రుణం ఇప్పిస్తామన్నారు. రూ. 50 కోట్లతో ఇప్పటికే మహబూబ్ నగర్, వరంగల్ తదితర జిల్లాల్లో ఈకార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు.
చేపల పెంపకం దారులకు సబ్సిడీపై చేపవిత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వ స్థలం ఉంటే ప్రతి మండల కేంద్రంలో రూ. 15 లక్షలతో చేపల విక్రయకేంద్రాలు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీఏ కిరణ్‌కుమార్, సర్పంచ్ బైరి అంజవ్వ, నాయకులు ఎర్వాలకృష్ణారెడ్డి, మహ్మద్ ఎజాస్, జంగం గంగాధర్, దుద్దాల అంజిరెడ్డి, సాయిరెడ్డి, విజయ్‌గౌడ్, లతీఫ్, నరేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాడితో ఆర్థిక స్వావలంబన సాధించాలి
Published Mon, Oct 6 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement