మంచిర్యాల టౌన్ : జిల్లాలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులు, నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో నీటిపారుదలశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, ప్రాజెక్టుల ఎస్‌డీసీలు, సింగరేణి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పనులతోపాటు జిల్లాలోని పలు గ్రామాల్లో చేపడుతున్న ప్రాజెక్ట్ పనులు, భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారమూ తక్షణమే అందించేలా చూడాలన్నారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, రోడ్లు, మురికికాలువలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.
శ్రీరాంపూర్, కాసీపేట ఓసీపీల కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ భూములను వెంటనే సింగరేణి అధికారులకు అప్పగించాలని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న చందనాపూర్, పడ్తనపల్లి గ్రామాల పునరావాస కాలనీల్లో రోడ్ల వెడల్పు, సీసీ రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారని ఈఈ కలెక్టర్‌కు నివేదించారు. సమావేశంలో మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, ఎస్డీసీలు తిరుపతిరావు, పాండురంగం, ప్రత్యేక కలెక్టర్ సుందర్ అబ్నార్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గూడెంలో కలెక్టర్ పూజలు
గూడెం(దండేపల్లి) : దండేపల్లి మండలం గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయాన్ని కలెక్టర్ జగన్మోహన్ గురువారం సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వెంకటస్వామి, ఈవో పురుషోత్తమాచార్యులు కలెక్టర్‌ను సన్మానించారు. ఆలయం వద్ద వసతుల కల్పన వివరాలను ఈవో వివరించారు. కాగా, గూడెం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఘాట్‌రోడ్డు, తాగునీరు, విద్యుత్ సరఫరా కోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
పుష్కరఘాట్ స్థల పరిశీలన
2015 జూలైలో జరిగే గోదావరి మహాపుష్కరాల కోసం గూడెం గోదావరి నది వద్ద నిర్మించనున్న పుష్కరఘాట్ స్థలాన్ని కలెక్టర్ జగన్మోహన్ గురువారం పరిశీలించారు. పుష్కరాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చే స్తామన్నారు. ప్లాస్టిక్ కవర్లు, చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి నీరు కలుషితం కాకుండా చూడాలని చెప్పారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు, నిర్మల్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ రవికిషన్, తహశీల్దార్ ముబిన్‌మైమద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈవోపీఆర్డీ శివకృష్ణ ఉన్నారు.
లక్సెట్టిపేటలో..
లక్సెట్టిపేట : లక్సెట్టిపేట శివారులోని గోదావరి నది పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఎం.జగన్మోహన్ గురువారం పరిశీలించారు. నది తీరంలో శివలింగం ఏర్పాటు చేయాలని ఎంపీపీ కట్ల చంద్రయ్య కోరగా చర్చిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి గోదావరి వరకు రోడ్డు విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానమ్, జెడ్పీటీసీ సభ్యుడు చుంచు చిన్నయ్య, ఇన్‌చార్జి తహశీల్దార్ ఇంతియాజ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఈవోపీఆర్డీ సత్యనారాయణ ఉన్నారు.
భూసేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
Published Fri, Oct 17 2014 3:00 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM
Advertisement
Advertisement