కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడం కష్టసాధ్యమైనా అమలు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్‌లో ‘తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య సాధ్యాసాధ్యాలు’ అంశంపై శనివారం చర్చా వేదిక నిర్వహించారు. చర్చావేదికలో వికాస సమితి నేతలతోపాటు, పలువురు ప్రొఫెసర్లు, ఉపాధ్యాయసంఘాల బాధ్యులు, అధ్యాపకులు, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి గౌరవ సలహాదారుడు, కేయూ ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెబుతున్న కే సీఆర్‌ను అభినందించాల్సిందేనని, అయితే ఎలా అమ లు చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో భాగంగా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లిష్ మీడియానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదో తరగతి నుంచే అమలు చేయాలన్నారు.
సరైన నిర్ణయాలు తీసుకోవాలి
విద్యావ్యవస్థపై ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలని డీటీఎఫ్ అధ్యాపక జ్వాల సంపాదకుడు గంగాధర్ సూచించారు. విద్యారంగంలో మార్పుల కోసం పలు కమిషన్లు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉచిత విద్యను కేజీటూ పీజీ వరకు అందిస్తామని చెబుతూనే రేషనలైజేషన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా 3 నుంచి 4 శాతం నిధులే కేటాయిస్తున్నారని విమర్శించా రు.
ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణా లు క్షీణిస్తున్నాయని పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రొఫెసర్ రామాచంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటెక్ చేసిన అభ్యర్థుల్లోను ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం లేదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా 3 లక్షల మంది బయటకు వస్తుండగా, వారిలో 13 శాతం మందికే ఉపా ధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
తెలంగాణ వికాస సమితి నల్లగొండ జిల్లా బాధ్యుడు బద్దం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తేనే పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వమే ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నాణ్యత పెంపొందించాలి
ఎస్‌సీఈఆర్‌టీ ఏఎంఓ సురేష్‌బాబు మాట్లాడుతూ ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బీఈడీ, డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు సరైన విధంగా శిక్షణ ఇవ్వాలని సూచిం చారు. కేయూ విద్యావిభాగం ప్రొఫెసర్ రాం నాథ్‌కిషన్ మాట్లాడుతూ విద్యలో నాణ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన ప్రాతిపదికన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని సూచించారు.
కేయూ మాజీ రిజిస్ట్రార్‌సదానందం, ప్రొఫెసర్ విజయ్‌బాబు, ప్రొఫెసర్ వీరన్ననాయక్, ఉపాధ్యాయుడు నర్సింహాస్వామి, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, సాదు రాజేష్, సైదిరెడ్డి, బిక్షపతినాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, రామ్మూర్తి, ఎం.శ్రీనివాస్, ఆదిలక్ష్మి, పద్మారావు, శంకర్‌నారాయణ, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆస్నాల శ్రీనివాస్, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.
ఉచిత విద్య అందించాలి
Published Sun, Oct 12 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement