‘కాషాయ’ రెపరెపలే లక్ష్యం
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ రాక
గ్రామస్థాయి కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు భేటీ
సాక్షి, హైదరాబాద్: ‘మొన్నటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 73 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. ప్రజలు అండగా ఉంటే 2019 ఎన్నికల్లో అన్ని సీట్లు రావచ్చు. కానీ దానికి గ్యారంటీ ఎవరివ్వగలరు..? ఒకవేళ అక్కడ సీట్ల సంఖ్య తగ్గితే వాటిని ఏ ప్రాంతం నుంచి పొందాల్సి ఉంటుంది..? ఇప్పుడు నా లక్ష్యం అదే. అందులో తెలంగాణ కూడా ఉండాలని కోరుకుంటున్నా..’ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మనసులోని మాట ఇది. కొద్ది రోజుల క్రితం తనను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇప్పుడు దాన్ని నిజం చేసే ఉద్దేశంతో ఓ ప్రణాళిక రూపొందించేందుకే ఆయన హైదరాబాద్ వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో ఇక్కడే మకాం వేసి తెలంగాణలో పార్టీ పరిస్థితి, స్థానిక రాజకీయాలు, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ఊహించనిరీతిలో బలోపేతం చేయాలంటే అనుసరించాల్సిన అంశాలపై సమీక్షించనున్నారు. తొలిరోజు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో గ్రేటర్‌హైదరాబాద్ నేతలతో భేటీ అవుతున్న షా ఆ రోజు రాత్రి సెస్ హాలులో పార్టీ ఆఫీస్ బేరర్లతో సమావేశమవుతున్నారు. ఈ రెండింటినీ ఒక్కపూటలోనే పూర్తి చేస్తున్న ఆయన.. శుక్రవారం మొత్తం సమయాన్ని బూత్‌స్థాయి, గ్రామస్థాయి అధ్యక్షులతో గడపాలని నిర్ణయించారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అవటానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో... గ్రామశాఖల అధ్యక్షులతో భేటీ అయ్యేందుకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటాన్ని పరిశీలిస్తే... పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. స్థానిక పరిస్థితులను కచ్చితంగా అర్థం చేసుకున్నాకగానీ.. పార్టీకి లాభం చేకూరాలంటే అనుసరించాల్సిన పద్ధతులను వెల్లడించని అమిత్‌షా... తెలంగాణ విషయంలోనూ అదే పంథాను అనుసరించబోతున్నారు. ఈ రెండురోజుల సమావేశాల్లో పార్టీ ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలు, సామాజికవేత్తలు, మేధావుల నుంచి సమాచారాన్ని సేకరించి ఢిల్లీ వెళ్లనున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కనీసం మూడు నాలుగు ఎంపీ సీట్లు వస్తాయని నరేంద్రమోడీ భావించారని, కానీ ఒక్క స్థానానికే పరిమితం కావటానికి కారణాలేంటో తెలుసుకోవటమే పర్యటన ఉద్దేశమని తెలుస్తోంది.
హైదరాబాద్ సెంటిమెంట్..
తాను గురువుగా భావించే ప్రధానినరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభలను హైదరాబాద్ నుంచే శ్రీకారం చుట్టారు. గతేడాది ఆగస్టులో బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గాఆయన ఎల్‌బీ స్టేడియంలో తొలి ఎన్నికల సభను నిర్వహించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. హైదరాబాద్ సభ అచ్చొచ్చిందని ఆయన నమ్ముతారు. ఇప్పుడు అమిత్ షా కూడా ఇదే సెంటిమెంటును అనుసరిస్తున్నారు. తాను పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత రాష్ట్రాల సమీక్షను హైదరాబాద్‌తో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సంఖ్యా పరంగా చివరి (29వ) రాష్ట్రమైన తెలంగాణతో ఆయన సమీక్షలకు శ్రీకారం చుడుతున్నారు.
కమల దళం లక్ష్యాలు...
- గత ఎన్నికల్లో బెంగాల్, తమిళనాడు, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... ఈ రాష్ట్రాల్లో 165 ఎంపీ స్థానాలుంటే బీజేపీ గెలిచింది కేవలం ఏడు మాత్రమే. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య వందకు చేరువ కావాలి. దీన్ని ఓ యజ్ఞంలా భావించాలి. ఉత్తరాది రాష్ట్రాలపైనే పార్టీ ఆధారపడటం సరికాదు.
- దేశంలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా అందులో గెలిచిన పార్టీల జాబితాలో బీజేపీ కచ్చితంగా ఉండాలి. ప్రతి కార్యకర్తకు ఇదే ఏకైక లక్ష్యం కావాలి.
- ఇతర పార్టీలపై దుమ్మెత్తి పోసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కంటే.. సొంత పార్టీ ఘనతను వారిలోకి తీసుకెళ్లి దగ్గరవ్వాలి. ఇందుకోసం పార్టీ త్వరలో కొన్ని సామాజిక అంశాల ఆధారంగా ప్రజల్లో చైతన్య తెచ్చే కాార్యాచరణ సిద్ధం చేస్తుంది.
- దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.
-
{పతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగరాలి. ప్రతి ఇంటికీ పార్టీ కార్యకర్త వెళ్లాలి.
పర్యటన ఇలా...
- మధ్యాహ్నం మూడున్నరకు అమిత్‌షా హైదరాబాద్ చేరుకుంటారు. విమానాశ్రయంలో పార్టీ రంగారెడ్డి జిల్లా నేతలు ఆయనకు స్వాగతం పలికి సన్మానిస్తారు.
- సాయంత్రం 4.30కు ఇంపీరియల్ గార్డెన్‌లో గంటన్నరపాటు గ్రేటర్ బీజేపీ శాఖ సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 7.15కు పంజాగుట్టలోని సెస్ హాలులో పార్టీ ఆఫీస్ బేరర్లతో భేటీ అవుతారు. శుక్రవారం పర్యాటక భవన్‌లో కొందరు మేధావులతో భేటీ అవుతారు. అనంతరం కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గ్రామశాఖల నేతలతో భేటీ అవుతారు.
అమిత్ షా సభను విజయవంతం చేద్దాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్: సంస్థాగత పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 22న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర గ్రామ అధ్యక్షుల సమావేశ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పుష్పలీల, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మీసాల చంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురువారం కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్‌లో జరగనున్న అమిత్ షా అభినందన సభ ఏర్పాట్లను బుధవారం ఆయన ఎంపీ దత్తాత్రేయతో కలసి పరిశీలించారు.