సాగర్‌లో నేడు గవర్నర్ పర్యటన
నాగార్జునసాగర్ :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ దంపతులు శుక్రవారం సందర్శించనున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గురువారం మిర్యాలగూడ డీఎస్పీ సందీప్‌గోనె, హాలియా సీఐ పార్థసారథి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్‌పీఎఫ్ భద్రతలో ఉండే సాగర్‌ప్రాజెక్టు, విద్యుదుత్పాదన కేంద్రాన్ని వారు పరిశీ లించారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే సాగర్‌లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయవిహా ర్ అతిథిగృహాన్ని పోలీసులు, అధికారులు ఆదీనంలోకి తీసుకుని ఏర్పాట్లు చేశారు. మూడు స్పెషల్ పార్టీ బృం దాలు, మూడు రోడ్‌చెకింగ్ బృందాలు, రెండు బాంబ్‌స్క్వాడ్ బృందాలు, 150 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తారని పోలీసు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసు బలగాలు కూడా బందోబస్తు నిర్వహించనున్నాయి.
గవర్నర్ పర్యటన సాగుతుంది ఇలా..
శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ దంపతులు సాగర్‌కు చేరుకుంటారు. టీ తాగిన అనంతరం సాగర్‌ప్రాజెక్టు విద్యుదుత్పాదన కేంద్రం, ఎత్తిపోతల ప్రాంతాలను సందర్శించనున్నారు. రాత్రి విజయవిహార్‌లో బసచేసి శనివారం ఉదయాన్నే బుద్ధవనాన్ని సందర్శించి అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే శాంతిసిరిలాంచీలో నాగార్జునకొండకు వెళతారు. ధనుర్మాసం సందర్భంగా దంపతులు పూజ చేసుకోవడానికి స్థానిక సత్యనారాయణ స్వామి ఆలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ డీవీఎం వెంకటేశ్వర్‌రావు ఏర్పాట్లు చేయించారు. మ్యూజియం సింహళీయం,యజ్ఞశాల,చైత్యాలు గవర్నర్ దంపతులు సందర్శించనున్నారు.