ప్రేమమూర్తి.
జిల్లా అంతటా వేడుకలకు సన్నాహాలు
వెలుగులు విరజిమ్ముతున్న చర్చిలు
బుధవారం రాత్రి నుంచే ప్రార్థనలు
మార్మోగుతున్న యేసు కీర్తనలు
అంధకారం అలముకున్న లోకానికి ఆయన వేగుచుక్క అయ్యాడు. అమృత వాక్కులతో వెలుగులు ప్రసరింపజేశాడు. దీనులను లాలించి అక్కున చేర్చుకున్నాడు. తన ప్రాణాలకు హాని తలపెట్టిన వారికి సైతం ప్రేమను పంచాడు. దయామయుడైన దైవకుమారుడు కన్ను తెరిచిన క్రిస్మస్ పర్వదినం నేడు. ఆ కరుణామయుడిని పూజించేందుకు జిల్లాలోని అన్ని చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
- కాజీపేట
క్రిస్మస్ సంబరాలకు జిల్లా సిద్ధమైంది. కరుణామయుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పునీతులవ్వాలని క్రీస్తు ఆరాధకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే. ప్రతీ చర్చినీ అందంగా అలంకరించారు. బుధవారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు ఈ నెలంతా ‘హాలీడే సీజన్’, ‘సీజన్ ఆఫ్ గివింగ్’, ‘సీజన్ ఆఫ్ జాయ్’గా అభివర్ణిస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన ఆ మానవతామూర్తి వాక్కులు ఇచ్చే స్ఫూర్తిని హృదయాల్లో నింపుకుంటారు. దీన్ని ‘స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్’గా పిలుస్తారు.
వెలుగులు నింపే క్రిస్మస్ ట్రీలు.. స్టార్లు
క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల ఇళ్లన్నీ క్రిస్మస్ ట్రీలు, స్టార్లతో మెరిసిపోతున్నాయి. చర్చిల్లో పశువుల పాకలు ఏర్పాటు చేసి యేసు జన్మించిన దృశ్యాన్ని బొమ్మలతో అందంగా అలంకరిస్తున్నారు. జిల్లాలో మూడువేలకు పైగా పెద్ద చర్చిలు, ఆరువేల వరకు చిన్న, చిన్న చర్చిలు ఉంటాయని అంచనా. తొమ్మిదివేల మంది పాస్టర్లు జిల్లాలోని వివిధ చర్చిలను నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా గురువారం జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. కెథడ్రల్, సెయింట్ జోసఫ్, బాప్టిస్టు, ఒమేగా అల్ఫా, బైబిల్ మిషన్, జాన్ మార్కండేయ తదితర శాఖల ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాజీపేటలోని కెథడ్రల్ చర్చి ఆవరణలో వరంగల్ మేత్రాసనం పీఠాధిపతి బిషప్ ఉడుముల బాల ఆధ్వర్యంలో రోమన్ కేథలిక్‌లు క్రిస్మస్ వేడుకలను భారీస్థాయిలో నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి నుంచే ప్రారంభమైన వేడుకల్లో గురువులు, బ్రదర్లు, సిస్టర్లు, పాస్టర్లు చర్చిల్లో ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ ప్రార్థనలు చేశారు. బిషప్ డానియల్ కళ్యాణ్, ఫాదర్ ఏరువా చిన్నపరెడ్డి, జాన్‌మార్కండేయ, బ్రదర్ పాల్‌సన్‌రాజ్, ప్రకాష్‌రాజ్, కురియన్‌ల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్రిస్మస్ ఫీస్ట్ నిర్వహించారు. చర్చి సభ్యులందరూ కుటుంబ సభ్యులతో పాల్గొని ఉత్సాహంగా గడిపారు.
సేవా కార్యక్రమాలు
క్రిస్మస్ పండుగకు గుర్తుగా పేదలు, వికలాంగులు, వృద్ధులకు నూతన వస్త్రాలు పంచిపెట్టారు. ఇక గురువారం చర్చిల్లో స్త్రీలు, చిన్నపిల్లలు, యువతకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల సంఘం అధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం జిల్లాలోని అన్ని చర్చిల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక ఆరాధన నిర్వహించనున్నారు.