భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రగిరిలో ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం మిథిలా స్టేడియంలో మంగళవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే రామయ్య పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ కమనీయ దృశ్యాన్ని వీక్షించి తరించేందుకు ఇప్పటికే వేలాది మంది భద్రాచలం చేరుకున్నారు. సోమవారం సాయంత్రానికి రామాలయం పరిసరప్రాంతాలు, గోదావరి ఘాట్, కరకట్ట.. ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామివారి కల్యాణానికి రెండు లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు.. తదనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
కల్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. కల్యాణ మండ పంలో ప్రత్యేకంగా విభజించిన సెక్టార్‌లలో 20,020 మంది కూర్చొని చూసేలా టికెట్లను విక్రయించారు. స్టేడియం గ్యాలరీపై మరో 15,800 మంది భక్తులు కూర్చునేలా తగు ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట ఉండే భక్తుల కోసం రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రామాలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేశారు. గోదావరి స్నానఘట్టాల రేవు, విస్తాకాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టెంట్లు వేశారు. ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లును నిర్మించారు.
విద్యుత్ దీపాలంకరణలతో రామాలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను అందజేసేందుకు వీలుగా రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు ఉపశమనం పొందేలా మిథిలా స్టేడియంలో ప్రత్యేకంగా 40 కూలర్లను ఏర్పాటు చేశారు. గవర్నర్, వీవీఐపీలు కూర్చునే సెక్టార్‌లో 180 టన్నుల కెపాసిటీ గల ఏసీని అమర్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సెక్టార్‌లలో తాగునీటి సౌకర్యం కల్పించారు. స్వామివారి కల్యాణ తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో అందరికీ అందజేసేందుకు 120 క్వింటాళ్ల తలంబ్రాలు, 1.50 క్వింటాళ్ల ముత్యాలు సిద్ధం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి అందరికీ ముత్యాలతో కూడిన తలంబ్రాల ప్యాకెట్లు అందజేసేలా రూ.5కు ప్యాకెట్ చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే స్వామివారి పెళ్లి వేడుక పూర్తయిన తరువాత భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేసేందుకు పట్టణంలోని పలు చోట్ల ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేశారు.
ముత్యాల తలంబ్రాలతో రానున్న గవర్నర్...
శ్రీ సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీసుకొస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు. గవర్నర్ రాకతో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చే సింది. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
రేపు మహా పట్టాభిషేకం...
మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలోనే బుధవారం స్వామివారికి మహా పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే ఈ వేడుకను కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహాపట్టాభిషేకానికి కూడా దేవస్థానం అధికారులు టికెట్ల ధరలను నిర్ణయించారు. వీవీఐపీ సెక్టార్‌లో అయితే రూ.250, వీఐపీ సెక్టార్‌కు రూ.100 చొప్పున స్టేడియం ప్రాంగణంలోనే విక్రయానికి పెట్టారు. మిగతా సెక్టార్‌లలో ఉచితంగానే భక్తులను అనుమతిస్తారు.
భద్రాద్రికి పెళ్లికళ
Published Tue, Apr 8 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
Advertisement