
బడిబుడి అడుగులతో..
సెలవులకు సెలవులు వచ్చేశాయ్.. బుధవారంతో హాలీడేస్ ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఎప్పుడు లేచామో తెలీదు... ఎప్పుడు నిద్రించామో తెలీదు.. నిత్యం టీవీకే అతుక్కుపోవడం, ఆటాపాటలతో కాలక్షేపం చేయ డం.. లేదా బంధువుల ఇళ్లకు వె ళ్లడం.. ఇదీ నిన్నటి వరకు పాఠశాల చిన్నారులు చేసిన పను లు. ఇక నేడు పాఠశాలలు ప్రా రంభమవుతుండడంతో వాటికి స్వస్తి చెప్పాల్సిందే..
ఆదిలాబాద్‌టౌన్ : సెలవులకు సెలవులు వచ్చేశాయ్.. బుధవారంతో హాలీడేస్ ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెలన్నరపాటు పుస్తకాలకు స్వస్తి చెప్పిన విద్యార్థులు ఆటాపాటలతో గడిపారు. బంధువుల ఇళ్ల వద్ద సందడి చేశారు. కొండలు, కోనలు, గుట్టలు, ఆటలు, సినిమాలు మావే అని చిచ్చిర పిడుగులు సంతోషంగా గడిపారు. ఇలా గడిపిన వారంతా ఒక్కసారిగా పాఠశాల బాట పడుతున్నారు.
మారం చేస్తారేమో...!
నిన్నామొన్నటి వరకు జాలీగా తిరిగిన పిల్లలంతా ఒక్కసారిగా స్కూల్‌కు వెళ్లాలంటే మారం చేయడం సర్వసాధారణం. అందుకే తల్లిదండ్రులు వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిచ్చర పిడుగులంతా సందడికి సెలవు ఇవ్వాల్సిందే. ఇక బారెడు పొద్దెక్కేదాక నిద్రపోవడాలూ ఉండవు, అర్ధరాత్రి దాకా టీ‘వీక్షణాలూ’ ఉండవు. ఒక్కసారిగా టైమ్ టేబుల్ మారిపోతుంది. మరి చిన్నారులు వెంటనే ఈ మార్పుకు సై అనగలరా? 40 రోజులకు పైగా మూలన పడేసిన క్రమశిక్షణను అర్జంటుగా అలవరచుకోగలరా? కొంత ఇబ్బంది సర్వసాధారణమే. ఇప్పటివరకు తాము కోరుకున్న స్వేచ్ఛను అనుభవించిన తమను ఒకేసారి తరగతి గది అనే పంజరంలోకి పంపిస్తున్నారనే భావనతో ఉన్న చిన్నారులకు మైండ్‘సెట్’ను ట్యూన్ చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్వాగతం పలకనున్న సమస్యలు..
సరదాగా వేసవి సెలవులు పూర్తిచేసిన విద్యార్థులకు పాఠశాలలు మొదటి రోజే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ఉపాధ్యాయుల కొరత, చెట్ల కింద చదువులు, మరుగుదొడ్ల లేమి, తదితర సమస్యలు తప్పేలా లేవు. పాఠశాల మొదటి రోజే దుస్తులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇంకా పాఠశాలలకు చేరుకోలేదు. పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు. పాలకులు, అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని పదేపదే హామీ ఇస్తున్నా నెరవేరడం లేదు. దీంతో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయుల కొరత, తదితర సమస్యలతో పదో తరగతి ఫలితాలు పడిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలోనైనా పదో తరగతి ఫలితాలు టాప్ 10గా ఉంటాయని ఆశిద్దాం.