నేడే ‘స్వచ్ఛ హైదరాబాద్’
సాయంత్రం 3 గంటలకు హెచ్‌ఐసీసీలో ప్రారంభం
పాల్గొననున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ ఆరంభ సంరంభానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్’కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్ర మాన్ని హెచ్‌ఐసీసీలో శనివారం సాయంత్రం 3 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై రూపొందించిన ప్రత్యేక గీతం, లోగోలను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎంలతో సహా ప్రజాప్రతినిధులు ప్యాట్రన్లుగా, ఏఐఎస్‌లు, వివిధ శాఖాధిపతులు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు సాయంత్రం 4.35 గంటలకు ఈ కార్యక్రమం ముగియగానే తమ యూనిట్లకు వె ళ్లి స్థానిక కాలనీ ప్రజలకు కార్యక్రమ అంశాలను వివరిస్తారు. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
కార్యక్రమ ముఖ్యాంశాలు
►రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని ఆనందనగర్ కాలనీకి యూనిట్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు.
►సీఎం కేసీఆర్ బౌద్ధనగర్ డివిజన్‌లోని పార్సీగుట్ట ప్రాంత ప్యాట్రన్‌గా ఉన్నారు.
► ఈ మహా కార్యక్రమంలో పాల్గొనే మొత్తం సభ్యులు: 36 వేలు
► వీరిలో 456 మంది వీవీఐపీలు/ఏఐఎస్ అధికారులు/వివిధ శాఖాధిపతులు
► ఇంకా 1,800 మంది నోడల్ అధికారులు, బిల్ కలెక్టర్లు, పోలీసులు, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు
► ఆరువేల మంది స్థానిక ప్రముఖులు
► 1,200 మంది తక్షణ మరమ్మతు బృంద సభ్యులు, 400 మంది మేస్త్రీలు, 800 మంది కార్మికులు
► 1,061 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, 23 వేల మంది శానిటరీ వర్కర్లు
► 2,010 మంది ఐలా, కంటోన్మెంట్ అధికారులు
నిర్వహణ ఏర్పాట్లివీ...
► మొబైల్ అప్లికేషన్ ద్వారా రోజువారీ కార్యాచరణ నివేదికలు
► {పత్యేక యాప్ ద్వారా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల నివేదిక
►500 మంది కళాకారులతో ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు
► సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖుల భాగస్వామ్యం