
కరువు జిల్లాపై.. కరుణ చూపేనా?
రాష్ర్ట బడ్జెట్‌పై పాలమూరువాసుల భారీ ఆశలు
► నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి రాజేందర్
► ‘పాలమూరు-రంగారెడ్డి’కి ప్రాధాన్యం ఇస్తారన్న ఆశాభావం
► జిల్లా ప్రాజెక్టులకు రూ.820 కోట్ల ప్రతిపాదన
► 18 నెలలుగా ప్రాజెక్టులలో నామమాత్రపు పనులు
► నిధులు కోరిన మేరకు కేటాయించి
► పనులు చేపట్టకపోతే లక్ష్యం కష్టమే
► వలసల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలంటున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ కరువు కోరల్లో అల్లాడుతున్న పాలమూరు ప్రజలు రాజేంద్రుడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తారని ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ఈసారి బడ్జెట్‌లోనైనా పూర్తిస్థాయి కేటాయింపులు లభిస్తాయా అన్న అంశం చర్చనీయాంశమైంది.
ప్రతి అంశంలోనూ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అదేస్థాయిలో ఇస్తే తప్ప ఇక్కడి వ్యవసాయ రంగం, తద్వారా రైతులు కోలుకునే పరిస్థితి కనిపించే అవకాశం లేదు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొదించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తారని జిల్లా ప్రజలు కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు రూ.30కోట్ల విలువైన 18 ప్యాకేజీ పనులకు సంబంధించి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది.
అందుకు అనుగుణంగానే పాలమూరును త్వరితగతిన పూర్తి చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించిన నిధుల ద్వారా భూసేకరణ పనులు చకచకా సాగుతుండగా, నిర్మాణ పనులకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది.
►జిల్లాలో గతేడాది సాగునీటి ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం 80వేల ఎకరాలకే సాగునీరందించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఐదున్నర లక్షల ఎకరాలకు పైగా సాగునీరందించాలని లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో ఎంతమేరకు వీలవుతున్నదని వేచి చూడాల్సిందే.
► జిల్లాలోని వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్య రంగాల్లో అనేక పనులు, ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉండగా అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు లేకపోవడం, కేటాయించిన నిధులతో కొంతవరకే పనులు పూర్తవడం వంటి పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. జిల్లాలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితి నెలకొని ఫిబ్రవరికి ముందే తాగునీటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలో పశువులకు మేత అందుబాటులో లేక వాటిని కబేళాలకు తరలిస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది.
► జిల్లాలోని 64మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా ఇందుకు సంబంధించి ప్రభుత్వం సహాయాన్ని ఇంకా విడుదల చేయలేదు. జిల్లాలో రూ.500 కోట్ల వరకు కరువు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు రూపొందించినా దీనికి సంబంధించి సాయం మాత్రం విడుదల కాలేదు.
► స్థానికంగా ఉపాధి పనులు లభించకపోవడంతో ప్రతి ఏడాది దాదాపు 4.70లక్షల కుటుంబాలు పొట్టచేత పట్టుకొని వలసబాట పడుతున్నాయి. మరోవైపు గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేకపోవడం విశేషం.
► ఈ బడ్జెట్‌లో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు ఇచ్చే నిధుల కోటాను పెంచుతారన్న ఆశతో శాసనసభ్యులు సైతం ఆశతో ఉన్నారు. ప్రతి ఏడాది కేటాయించే రూ.కోటి నిధులు నియోజకవర్గ అభివృద్ధికి ఏ మూలకూ సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తేవడంతో ఈ నిధులను రూ.2 కోట్లకు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.