జురాల ప్రాజెక్టు
సాక్షి, గద్వాల: రాష్ట్ర బడ్జెట్‌పై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడం, అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టనుండటంతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తుతున్నాయి. త్వరలో ఎంపీ, మండలి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధిలో వెనకబడిన పాలమూరుకు గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇస్తారనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
గత బడ్జెట్‌లో..
గత బడ్జెట్‌లో కులవృత్తులకు, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినప్పటికి పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. డబుల్ బెడ్‌రూం పథకం ఒక్క మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మినహా ఎక్కడా కూడా ఆశించినస్థాయిలో పురోగతి లేదు. చాలాచోట్లా శంకుస్థాపనలకే పరిమితమైంది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కూడా ముందుకు సాగలేదు. పెట్టుబడిసాయం మరింత పెంచిన నేపథ్యంలో బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. మత్స్య, పశు, చేనేతరంగాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయోనన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా మరోవైపు కీలకమైన ప్రాజెక్టుల విషయంలో నిధుల కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది.
ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఉంటుందా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 10లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించక పోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జూరాల, కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, సంగంబండ, ఆర్డీఎస్, తుమ్మిళ్ల ద్వారా దాదాపు ప్రస్తుతం 7.5లక్షల ఎకరాలకు సాగునీరు అందుంతుండగా భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది.
గతేడాది బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు 4,223.6కోట్లు కేటాయించింది. ఈ ఏడాది పెరుగుతాయా తగ్గుతాయా అనేది నేటి బడ్జెట్‌లో తేలుతుంది. ప్రస్తుతం పనులు అసంపూర్తిగా ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుల పనుల పూర్తి కోసం మరో రూ.1000 కోట్లు ఇస్తే గాని పనులు పూర్తయ్యే అవకాశం లేదని సాగునీటిశాఖ అధికారులంటున్న మాట. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయింది. ఇక రాష్ట్ర బడ్జెట్‌లో పనుల పూర్తి కోసం అవసరమయ్యే నిధులు మంజూరు చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని సాగునీటిశాఖాధికారులంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి గతేడాది 4వేల కోట్లు కేటాయించారు. ఈ ఏడాది ఎంత కేటాయిస్తారనేది వేచి చూడాలి.
పెండింగ్‌లో రూ.403.74కోట్ల బిల్లులు..
జిల్లాలోని నాలుగు ప్రధాన ప్రాజెక్టు కింద పూర్తయిన పనులకు 6నెలలుగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. తుమ్మిళ్ల పథకానికి తప్ప మిగతా నెట్టెంపాడు, రాజీవ్‌భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల కింద చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లేక పనులను కాంట్రాక్టర్లు నెమ్మదిగా చేస్తున్నారు. నెట్టెంపాడు పథకంలోకి ప్యాకేజీల్లో పనులను కాంట్రాక్టర్లు వదిలేసిన క్రమంలో కొత్త కాంట్రాక్టర్లతో పూర్తి చేయించేందుకు సాగునీటి శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మిగతా ప్రాజెక్టుల పరిధిలోనూ ఎలాగైనా సరే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేయించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు ప్రాజెక్టుల కింద పెండింగ్ బిల్లులు సైతం రూ.403.74 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 2019–2020 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం సాగునీటి శాఖాధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
సంక్షేమ పథకాల సంగతి?
- రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. భూమిలేని దళిత కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మూడెకరాల భూమిని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ భూ పంపిణీలోనూ అనుకున్నంత లక్ష్యం చేరలేదు. తాజా బడ్జెట్‌లో ఈ పథకానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారనే ఆశలు ప్రజల్లో ఉన్నాయి.
- అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ పథకం ఉమ్మడి జిల్లాలో పెద్దగా ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాత్రమే కొంత పురోగతి సాధించింది. గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అంతంతమాత్రంగానే ఉంది.
- కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉండి ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెరువులతో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో మత్స్యపరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అపారమైన అవకాశాలున్నాయి. గత బడ్జెట్‌లో చేపల పెంపకానికి, పశుసంవర్ధకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఎంతోమంది మత్స్యకారులకు వాహనాలు అందజేయడంతో పాటు చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు
- గొర్రెల పంపిణీ పథకం రెండోదశ అమలులో కొంత వెనకబాటులో ఉంది. నిధుల కేటాయించాల్సిన అవసరం ఉంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా నిరుద్యోగులకు ఇచ్చే స్వయం ఉపాధి రుణాలు, ఉపకారవేతనాల చెల్లింపులోనూ నిధుల కొరత వల్ల పథకాలు సక్రమంగా అమలు కాని పరిస్థితి. ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారా లేదా అనేది చూడాలి.
- జోగుళాంబ గద్వాల జిల్లాలో చేనేత, జౌళి రంగానికి చేనేత కార్మికులకు, సహకార సంఘాలకు మరింత ఊతం ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేనేత పరిశ్రమ అభివృద్ధికి గత బడ్జెట్‌లో రూ.1200 కోట్లను కేటాయించారు. ఇందులో గద్వాల చేనేత పార్కుకు, చేనేత కార్మికుల అభివృద్ధికి, చేనేత రంగంలో శిక్షణకు అవసరమైన నిధులను కేటాయిస్తారు. అభివృద్ధి జరుగుతుందని భావించినప్పటికి చేనేత పార్కు అభివృద్ధిలో ఎలాంటి పురోగతి సాధించలేదు. విద్య, వైద్య రంగాలకు కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment