
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని, ఆ అవకాశం తనకు మాత్రమే వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మహబూబ్ నగర్‌లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.
‘‘సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్యలపై సమీక్ష చేశాం. కార్యకర్తల కష్టంతో కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009లో కేసీఆర్‌ను ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల ఆపకుండా చేయాలని అధికారులను ఆదేశించాను. నేను మీలో ఓ కార్యకర్తను. కేసీఆర్‌ను ఓడించడమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి. త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం.
మిమ్మల్ని గెలిపించే భాద్యత మాది, మీ ఎమ్మెల్యేలది. దేవాలయ, మార్కెట్ కమిటీ, గ్రంధాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకుంటా. కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్ధాయికి వచ్చాను. వారిని విస్మరించను. గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్ కనుమరుగవుతారు. 4 రోజులుగా ఢిల్లీలో కాలుకాలిన పిల్లిలాగా కేటీఆర్, హరీష్ రావు ప్రధానిని కలిసేందుకు తిరుగుతున్నారు.
డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూపు- 1 అధికారులను నియమించాలని మేం ప్రయత్నిస్తుంటే కొందరు దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదావేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేసి తీరుతా’’ అని సీఎం రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment