బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.
పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.
తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.
ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.
కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.
దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.
మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.
కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.
మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్‌తో సహా ఏడుగురు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది.
పార్టీ మారటం లేదు..
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment