సాక్షి,గజ్వేల్: పార్టీ పవర్‌లో ఉన్నపుడు అత్యున్నత పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్‌ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారు నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? వారిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.
ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో మంగళవారం(జులై2) జరిగిన పార్టీ జెడ్పీచైర్మన్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారన్నారు.
గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జెడ్పీచైర్మన్‌లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తోంది.
అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలి. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు. మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తున్నాం’అని కేసీఆర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment