రూ.31,300 కోట్లు కావాలి! | The proposals of the Department of Irrigation | Sakshi
Sakshi News home page

రూ.31,300 కోట్లు కావాలి!

Published Wed, Jan 11 2017 3:22 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

రూ.31,300 కోట్లు కావాలి! - Sakshi

రూ.31,300 కోట్లు కావాలి!

► వచ్చే బడ్జెట్‌లో కేటాయింపుల కోసం సాగునీటి శాఖ ప్రతిపాదనలు
► కాళేశ్వరానికి రూ.11 వేల కోట్లు, పాలమూరుకు రూ.6 వేల కోట్లు
► చిన్న నీటిపారుదల శాఖకు రూ.2,520 కోట్లు కావాలని అంచనా
► గతేడాది కేటాయింపులు రూ.25 వేల కోట్లు.. ఖర్చు రూ.9,517 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను సాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధ మయ్యాయి. వివిధ ప్రాజెక్టుల పరిధిలో పురోగతి, వాటి ప్రాధాన్యతల ఆధారంగా నీటిపారుదల శాఖ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొత్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.31,300 కోట్లు కావాలని అంచనా వేసింది. ఇందులో ప్రాధాన్య ప్రాజెక్టులైన కాళేశ్వరం, పాలమూరులకు కలిపి ఏకంగా రూ.17 వేల కోట్లు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను మంగళవారం ఆర్థిక శాఖ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది.

వేగంగా కసరత్తు...
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏటా సాగునీటి బడ్జెట్‌ ప్రతిపాదనలను డిసెంబర్‌లోనే సిద్ధం చేస్తూరాగా... ఈసారి నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో ఆలస్యమైంది. అయినా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రతిపాదనలు అందించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యం లో... నీటి పారుదల శాఖ వేగంగా చర్యలు చేపట్టి, ప్రతిపాదనలు తయారు చేసింది. మొత్తంగా రూ.31,300కోట్లు అవసరమని అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాగునీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ), సమర్థ నీటి వాడక కార్యక్రమం(ఈఏపీ), గ్రామీణ మౌలిక వస తుల అభివృద్ధినిధి(ఆర్‌ఐడీఎఫ్‌) కింద ఎన్ని నిధులొస్తాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

మూడో వంతు కాళేశ్వరానికే!
మొత్తంగా సాగునీటి శాఖ కోరుతున్న బడ్జెట్‌ లో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.11,000 కోట్లు కావాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పను లు వేగంగా జరుగుతుండటం.. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ సహా మరో మూడు రిజర్వాయర్ల పనులు కొద్ది రోజుల్లోనే ఆరంభించే అవకాశాల దృష్ట్యా భారీ బడ్జెట్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇక భూసేకరణ సమస్యలు కొలిక్కి రావడంతో పాలమూరుకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు.

ఆ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి బడ్జెట్‌
ఇక ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టునిచ్చే ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాలకు పూర్తి స్థాయి నిధులు కేటాయించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రాథమిక సమాచారం మేరకు కల్వకుర్తికి రూ.వెయ్యి కోట్లు.. నెట్టెంపాడు, భీమాలకు చెరో రూ.200 కోట్లు కోరారు. గొల్లవాగు, సాత్నాల, కొమ్రంభీం, పెద్దవాగు, నీల్వాయితో పాటు ప్రాణహిత, లోయర్‌ పెన్ గంగలకు కలిపి రూ.2 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు రూ.1,900కోట్లు, ఎస్‌ఎల్‌బీసీకి రూ.900 కోట్లు, డిండికి రూ.400కోట్లు, ఎల్లంపల్లికి రూ.300కోట్లు, ఇందిరమ్మ వరద కాల్వకు రూ.600 కోట్లతో ప్రతిపాదించినట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు గతంలో కేటాయించిన మాదిరే రూ.2,520 కోట్లు అవసరమని.. వివిధ ప్రాజెక్టుల కింద సహాయ పునరావాసం కోసం రూ.900 కోట్లు కావాలని కోరారు. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.25 వేల కోట్లకు కుదించే అవకాశమున్నట్లు నీటి పారుదల వర్గాలు స్పష్టం చేశాయి.

మూడు నెలలు.. రూ.4వేల కోట్లు
2016–17 ఆర్థిక సంవత్సరంలో నీటి పారుదల శాఖకు రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించగా... అందులో ఇప్పటివరకు కేవలం రూ.9,517 కోట్ల మేర ఖర్చు చేశారు. మరో రూ.3 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కలుపుకొంటే మొత్తంగా రూ.12,500 కోట్ల మేర ఖర్చు చేసినట్లేనని నీటి పారుదల వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగతా మూడు నెలల్లో మరో రూ.4 వేల కోట్ల మేర పనులు పూర్తి చేస్తామని.. మొత్తానికి రూ.16,500 కోట్ల నిధులకు చేరుతుందని చెబుతున్నాయి. ఈ ఏడాది పాలమూరు ప్రాజెక్టుకు రూ.7,800 కోట్లు కేటాయించినా.. భూసేకరణ జాప్యం కారణంగా రూ.1,330 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. ఈ ప్రభావమే ఎక్కువగా నీటి పారుదల బడ్జెట్‌పై పడినట్లు నీటి పారుదల వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement