నేడు జిల్లాకు సీఎం కేసీఆర్
హన్మకొండ అర్బన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన ఖరారైంది. సీఎం కేసీఆర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడంతో పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొం టారు. హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయం నుంచి శుక్రవారం ఉదయం 11-50 గంటలకు బయలుదేరనున్న కేసీఆర్ బేగంపేట విమానాశ్రయూనికి చేరుకుని అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు మేడారం వస్తారు.
సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండ నగర శివారు మడికొండకు చేరుకుంటారు. మడికొండలోని ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఇక్కడ జరిగే సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.