హైదరాబాద్‌లో‍ ట్రాఫిక్‌ ఆంక్షలు ఎక్కడెక్కడ! | today traffic sanctions in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఆంక్షలు

Published Tue, Nov 28 2017 8:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

today traffic sanctions in hyderabad  - Sakshi - Sakshi - Sakshi

నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. మంగళ, బుధవారాల్లో పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్‌ నగరంలో పర్యటించనున్నందున  భద్రతా కారణాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నిర్ణీత వేళల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ, వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని కోరారు.  

ఫలక్‌నుమా పరిసరాల్లో..
చాంద్రాయణగుట్ట: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే విందు కార్యక్రమానికి ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ ఏ.వి.రంగనాథ్‌ తెలిపారు. ఫలక్‌నుమా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ప్యాలెస్‌లో జరిగే విందుకు ప్రధాని నరేంద్రమోదీ, ఇవాంక ట్రంప్‌లతో పాటు 2000 మంది ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పలుమార్లు రూట్‌ సర్వే, పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించామన్నారు. 50–60 బస్సుల్లో విదేశీ ప్రముఖులు ప్యాలెస్‌కు చేరుకుంటారన్నారు. మంగళవారం రాత్రి 7–8 గంటల మధ్య ప్రధాని, ఇవాంక, గవర్నర్‌ నరసింహాన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు ప్యాలెస్‌కు రానున్న నేపథ్యంలో ఆ సమయంలో చాంద్రాయణగుట్ట–బండ్లగూడ–ఫలక్‌నుమా రహదారులను పూర్తిగా మూసివేస్తామన్నారు. ఫ్‌లై ఓవర్లపై రాకపోకలు నిలిపివేస్తామని, రాత్రి 9.45 గంటల నుంచి 10.30 గంటల మధ్య ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పరిస్థితిని సర్యవేక్షించేందుకు 8 మంది ఏసీపీలు, 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 200 మంది సిబ్బంది నియమించామని, ప్యాలెస్‌ రూట్‌లో దుకాణాలను మూసివేయించడంతో పాటు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో ట్రాఫిక్‌ అదనపు డీసీపీ మహ్మద్‌ తాజుద్దీన్‌ అహ్మద్, ఏసీపీలు నాగన్న, శ్రీనివాస్‌ కుమార్, ఇన్‌స్పెక్టర్లు సి.హెచ్‌.నరేందర్‌ రావు, చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

వాహనాల దారి మళ్లింపు  
చార్మినార్‌ నుంచి ఫలక్‌నుమా వైపు వచ్చే వాహనాలు నాగుల చింత చౌరస్తా (లాల్‌దర్వాజా మోడ్‌) నుంచి లాల్‌దర్వాజా మీదుగా వెళ్లాలి. స్థానిక బస్తీల వాహనదారులైతే ఇంజన్‌బౌలి వరకు ప్రయాణించవచ్చు.
ఇంజన్‌బౌలి నుంచి చాంద్రాయణగుట్ట ఫ్‌లై ఓవర్‌ వరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పూర్తిగా రాకపోకల నిషేధం ఉంటుంది.  
ఎల్,బి.నగర్, సంతోష్‌నగర్‌ల నుంచి చాంద్రాయణగుట్ట వైపు వచ్చే వాహనాలు మిధాని చౌరస్తా నుంచి బాలాపూర్‌ ఎక్స్‌రోడ్డు వైపు వెళ్లాలి.
శ్రీశైలం హైవే నుంచి వచ్చే వాహనదారులు కేశవగిరి నుంచి గుర్రం చెరువు, బాలాపూర్‌ మీదుగా వెళ్లాలి.
ప్రధాని, ఇవాంక ట్రంప్‌ల కాన్వాయ్‌ సమయంలో చాంద్రాయణగుట్ట–బండ్లగూడ రహదారిలో రెండు వైపులా వాహనాలను పూర్తిగా నిషేధిస్తారు.  

సైబరాబాద్‌ పరిధిలో..
సాక్షి, సిటీబ్యూరో: మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో మంగళవారం జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్‌)లో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంక రానున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మంగళవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ సదస్సు ప్రారంభానికి హాజరయ్యే అతిథులు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లనుండటంతో ఆ సమయంలో హెచ్‌ఐసీసీ నుంచి కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్‌ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో వెళ్లాలని పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య సూచించారు. యధావిధిగానే గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ వాహనదారులకు అందుబాటులో ఉంటుంది. వీవీఐపీ రాకను బట్టి అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్‌ నిలిపివేస్తామన్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. 

మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో..
మియాపూర్‌లో మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి 4.30 గంటల ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మియాపూర్‌ నుంచి కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్‌ పార్క్‌ జంక్షన్, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ గచ్చిబౌలి మీదుగా  అనుమతించనున్నారు. మియాపూర్‌ నుంచి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మియాపూర్‌ వద్ద దారి మళ్లించి చందానగర్, పటాన్‌చెరు, ఓఆర్‌ఆర్‌ మీదుగా ఎయిర్‌పోర్టుకు అనుమతించనున్నారు. మాతృశ్రీ నగర్‌ నుంచి వచ్చే వాహనాలను షీలా పార్క్‌ ప్రైడ్‌ వద్ద దారి మళ్లించి మంజీరా రోడ్డువైపు అనుమతించనున్నారు. పటాన్‌చెరు. ఇక్రిశా>ట్‌ బీరంగూడ, ఆర్‌సీపురం, ఆశోక్‌ నగర్, బీహెచ్‌ఈఎల్‌ నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను బీహెచ్‌ఈఎల్‌ రోటరీ వద్ద మళ్లించి నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్‌మోహర్‌ పార్క్‌ జంక్షన్, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, మెహదీపట్నం మీదుగా హైదరాబాద్‌కు అనుమతివ్వనున్నారు. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి నుంచి కూకట్‌పల్లి, హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను ఓఆర్‌ఆర్‌ ముత్తంగి వద్ద దారి మళ్లించనున్నారు.    

ప్రధాని కాన్వాయ్‌ రిహార్సల్‌
గచ్చిబౌలి: మెట్రో రైలు ప్రారంభోత్సవం అనంతరం హెచ్‌ఐసీసీలో జరగనున్న జీఈఎస్‌ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో సోమవారం సైబరాబాద్‌ పోలీసులు కాన్వాయ్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. మియాపూర్‌ నుంచి హెచ్‌ఐసీసీకి ప్రధాని హెలికాప్టర్‌లో హెచ్‌ఐసీసీకి చేరుకోనున్నప్పటికీ  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు. 20కి పైగా వాహనాలు కాన్వాయ్‌లో పాల్గొన్నాయి. 

హెలికాప్టర్‌ ట్రయల్‌ రన్‌
ప్రధాని రాకను పురస్కరించుకొని సోమవారం ఉదయం 10.05 గంటలకు మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి హెచ్‌ఐసీసీలోని హెలిప్యాడ్‌ వరకు హెలికాప్టర్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు.     

కోటలో ఏర్పాట్ల పరిశీలన
గోల్కొండ: గోల్కోండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం జీఈఎస్‌ ప్రతినిధుల విందు ఇవ్వనున్న నేపథ్యంలో  ఏర్పాట్ల ఇన్‌చార్జి, ఐజి స్వాతిలక్రా, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో కోటలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విందు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, పరిసర ప్రాంతాల్లో డాగ్‌ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. వీఐపీల వాహనాలు, కోటలో ప్రవేశించే మార్గం నుంచి వేదిక వరకు బందోబస్తు కట్టుదిట్టం చేయాలని సూచించారు. కోటలో బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. కోటలో ఈ నెల 29న జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిడివి 20 నిమిషాలే అయినా ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సాంçస్కృతిక కార్యక్రమాల రిహార్సల్స్‌ను తిలకించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్‌ యోగితారాణా తదితరులు ఉన్నారు.

‘గెస్‌’తో ప్రపంచస్థాయి గుర్తింపు సీఐఐ తెలంగాణ చైర్మన్‌ రాజన్న
రాయదుర్గం: గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదస్సు నిర్వహణతో హైదరాబాద్‌ నగర బ్రాండ్‌ ఇమేజ్‌ విశ్వవ్యాప్తం అవుతుందని సీఐఐ తెలంగాణ చైర్మన్‌ వి రాజన్న పేర్కొన్నారు. ఖాజాగూడలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ  గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు సీఐఐ చైర్మన్‌గా తనకు అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్, స్టార్టప్‌ పాలసీ, పారిశ్రామిక విధానం ద్వారా ప్రోత్సాహం కల్పిస్తోందని,  మౌలిక వసతులతో జాతీయ, అంతర్జాతీయస్థాయి సదస్సుల నిర్వహణకు కేంద్రంగా దేశంలో హైదరాబాద్‌ పేరుగాంచిందన్నారు. గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌కు హైదరాబాద్‌ నగరం ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఐఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ,ఫుడ్‌ ప్రాసెస్‌ పాలసీ వంటివి రూపకల్పనలో తోడ్పాటు అందించామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement