‘ఔటర్’పై మళ్లీ టోల్ బాదుడు
చార్జీలు అమాంతం పెంపు
మే నెల నుంచి అమలు
కొత్త ఏజెన్సీ కోసం టెండర్ల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్ల చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణం ఇకపై మరింత భారం కానుంది. టోల్ ట్యాక్స్ (దారి సుంకం) చార్జీలను పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయం తీసుకొంది. పెంచిన ధరలను మే నెల నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త రేట్ల ప్రకారం వాహనాన్ని బట్టి రూ. 10 నుంచి రూ. 60 వరకు అదనపు వడ్డింపు ఉండనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 119.45 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 17 చోట్ల టోల్‌ట్యాక్స్ వసూలు చే స్తున్నారు. వాహనాన్ని బట్టి ఒక జంక్షన్ నుంచి ఇంకో జంక్షన్ వరకు ప్రయాణానికి రూ.10 నుంచి రూ. 70 వరకు చార్జీ వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు... కారులో పటాన్‌చెరు నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ఔటర్‌పై ప్రయాణిస్తే పెరగనున్న ధరల ప్రకారం రూ.80 వరకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ దూరానికి రూ.70లు టోల్‌ట్యాక్స్ ఉంది. అలాగే ప్రస్తుతం మినీ బస్సులకైతే రూ. 110, బస్సు లేదా 2యాక్సిల్ ట్రక్‌లకు రూ.230లు, 3 యాక్సిల్, కమర్షియల్ వాహనాలకు రూ.260 చొప్పున చార్జీ ఉంది. వీటిపై కూడా పెరిగిన ధరల మేరకు అదనపు భారం పడనుంది.
టోల్ వసూలు కోసం టెండర్ల ఆహ్వానం
హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నగరం చుట్టూ 158 కి.మీ. మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం తలపెట్టగా... ఇప్పటికే 124 కి.మీ. రోడ్డు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. పెద్దఅంబర్‌పేట నుంచి శంషాబాద్ మీదుగా శామీర్‌పేట వరకు నార్సింగి (నానక్‌రామ్‌గూడ- గచ్చిబౌలి లింక్‌ను కలిపి), పటాన్‌చెరు, దుండిగల్, మేడ్చెల్ వరకు 119.45 కి.మీ మేర ఔటర్‌పై టోల్‌ట్యాక్స్ వసూలు బాధ్యతను పీకే హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థతో కుదుర్చుకొన్న ఒప్పందం గడువు ఈ నెల 31తో ముగుస్తోంది. దీంతో హెచ్‌ఎండీఏ కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతితో ఔటర్‌పై మ్యాన్యువల్‌గా టోల్ వసూలుకు టెండర్లను ఆహ్వానిస్తూ బుధవారం ప్రకటన జారీ చేసింది. ఔటర్‌పై అత్యాధునిక టోల్ వ్యవస్థ ఏర్పాటు కావడానికి 18 నెలలు సమయం పట్టనుండడంతో... అప్పటివరకు ఈ మార్గంలో టోల్ వసూలు చేసేందుకు హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది. నెలకు రూ. 2.94కోట్లు కనీస మొత్తంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఏప్రిల్ 26 ఆఖరు తేదీగా నిర్ణయించింది. అదే రోజు తార్నాకలోని ఓఆర్‌ఆర్ కార్యాలయంలో టెక్నికల్ బిడ్స్ తెరచి అర్హత గల సంస్థలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ తెరచి అర్హత కలిగిన సంస్థకు టోల్ వసూలు కాంట్రాక్టును అప్పగిస్తారు.