రేపు జెడ్పీ సారథుల ఎన్నిక
- కో ఆప్షన్ సభ్యులు మళ్లీ నామినేషన్లు వేయాల్సిందే
- జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరి స్తామని, గత వారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కూడా మళ్లీ దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు. అనంతరం 3 గంటలకు మళ్లీ మొదలయ్యే సమావేశంలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక లు జరుగుతాయని వివరించారు.
కోరం తప్పనిసరి: జిల్లా పరిషత్ సమావేశం జరగాలంటే కోరం తప్పనిసరి. 17 మంది సభ్యులు హాజరైతే నే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిర్దేశిత సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికలు వాయిదా పడతాయి. ఆ తర్వాత 3 గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడుతుంది. మరుసటి రోజుకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ క్రితం రోజు పరిస్థితే పునరావృతమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ నిర్ణయం మేరకు తదుపరి తేదీని ప్రకటిస్తారు. కోరం సంపూర్ణంగా ఉండి కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగిన అనంతరం, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక సమయంలో కోరం లేకున్నా ఎన్నిక వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు.