రేపు సీడబ్ల్యూసీ ముందు తెలంగాణ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ముందు తనవాదనను వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి గోదావరి బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శి హాజరవుతుండటం, పర్యావరణ అనుమతులు పొందేందుకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు కీలకమయిన నేపథ్యంలో దీనిపై అన్ని కోణాల్లో వివరణలు ఇచ్చేలా ప్రజెంటేషన్ సిద్ధం చేసింది. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టేనని, దీనికి కొత్తగా ఎలాంటి అనుమతులు అక్కర్లేదని వాదించ నుంది. కాళేశ్వరం సాంకేతిక, ఆర్థిక అంశాలపై సీడబ్ల్యూసీ నుంచి సూత్ర ప్రాయ అనుమతులు తీసుకోవాలంటూ ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ మదింపు ప్రక్రియకు నిరాకరించిన విషయం తెలిసిందే.
దీనిపై తెలంగాణ సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేయగా, 20న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తూ నిర్ణయం చేసింది. తెలంగాణ ప్రభుత్వ వాదనను పూర్తిగా విన్నాకే దీనిపై ఓ అవగాహనకు వస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ హరిరామ్ తదితరులు ప్రజెంటేషన్ అంశాలపై తీవ్ర కసరత్తు చేశారు. అవసరమొస్తే గోదావరిపై తనకున్న వాటాని మించి ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయాలని, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సైతం సేకరించినట్లుగా తెలిసింది.