అభ్యర్థుల గెలుపుపై చర్చోప చర్చలు | Tomorrow vote counting of municipalities | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల గెలుపుపై చర్చోప చర్చలు

Published Sun, May 11 2014 12:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Tomorrow vote counting of municipalities

 ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ :  ఎన్నికల జాతర ముగిసింది. ఇక ఫలితాల కోసమే అందరి ఎదురుచూపు. నెల రోజులుగా పట్టణ, పల్లె ప్రాంతాల్లో కొనసాగిన ఓట్ల పండుగకు తెరపడింది. ఏకకాలంలో మున్సిపాలిటీ, స్థానిక, సార్వత్రిక పోరు జరగడంతో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. నెల రోజులపాటు ఓటరు మహాశయులకు వినోదం పంచింది. తాజాగా ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. అభ్యర్థులైతే చర్చోపచర్చలు సాగిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తుందనే కారణంతో మున్సిపల్, ప్రాదేశిక ఓట్ల లెక్కింపును సుప్రీంకోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఫలితాలు ఐదు రోజుల వ్యవధిలో వెలువడనుండడంతో పోటీ చేసిన అభ్యర్థులతోపాటు అన్ని రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ధీమాలో ఉన్నవారు మెజార్టీపై లెక్కలు వేసుకుంటుంటే.. పోటాపోటీగా ఉన్నచోట గట్టెక్కుతామా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు. సాధారణ ఎన్నికల సందడిలో నిమగ్నమైన రాజకీయ నాయకులు ఇప్పుడు ఫలితాల విశ్లేషణపై దృష్టి సారించారు. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కీలకఘట్టం ముగిడయంతో జిల్లా యంత్రాంగం కూడా ఓట్ల లెక్కింపుపై దృష్టిసారించింది.

 రేపే మున్సిపల్ ఫలితాలు
 జిల్లాలో మార్చి 30న మున్సిపల్  ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ ఈ ఆరు మున్సిపాలిటీల్లోని 189 వార్డుల్లో 1,095 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వీటి ఫలితాలు సోమవారం (12వ తేదీ)న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించడంతో.. కౌంటింగ్ రోజు కొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా తమ అభ్యర్థులు బరిలోకి దింపాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల ఫలితాల జాతరలో మున్సిపల్ ఫలితాలు తొలుత వెలువడనుండడంతో అన్ని పార్టీలలో ప్రస్తుతం దీనిపైనే ఆసక్తి చూపుతున్నారు.

 13న పరిషత్..
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థుల్లో ఆత్రుత నెలకొంది. మార్చి 6న తొలివిడత, 11న మలివిడత ఎన్నిలకు జరిగాయి. నెల రోజుల తర్వాత ఫలితాలు వెలువడనుండడంతో పల్లెపోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని ఇటు అభ్యర్థులు, అటు రాజకీయ పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పరిషత్ ఫలితాలు వెలువరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల్లో 52 జెడ్పీటీసీ స్థానాలకు 269 మంది అభ్యర్థులు, 636 ఎంపీటీసీ స్థానాలకు 2,654 మంది బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలపై పరిషత్ ఎన్నికలు ప్రభావం చూపడనుండడంతో ఆయా పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

 సార్వత్రిక ఫలితాలు కీలకం
 మూడు ఎన్నికలు జాతరగా జరిగినా సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అన్ని పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ఈనెల 16న సార్వత్రిక ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలతోనే జిల్లాలో ఏ బలం ఎంత అనేది బయటపడనుంది. అలాగే తెలంగాణలో తొలి అసెంబ్లీలో జిల్లా నుంచి ఎవరు అడుగుపెడతారో తేలనుంది. నామినేషన్లు వేసినప్పటి నుంచి అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రచార పర్వం, ఓటర్లకు గాలం వేయడంలో అభ్యర్థులు వినూత్న శైలిలో ముందుకెళ్లారు. పది అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, రెండు లోక్‌సభ స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి బ్రహ్మరథం పడతారో వేచిచూడాల్సిందే.

 1000 మంది ప్రజాప్రతినిధులు
 ఎన్నికల జాతరతో జిల్లాలో 1000 మంది ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు. మరో పది రోజుల్లో మూడున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న మండల, జిల్లా పరిషత్, పురపాలక సంఘాల్లో పదవుల జాతర మొదలుకానుంది. అయితే ఏ పదవి ఎవరిని వరిస్తుందో ఫలితాలు వెల్లడయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే. జిల్లా వ్యాప్తంగా 636 మండల ప్రాదేశిక సభ్యులు, 189 మంది కౌన్సిలర్లు, 52 మంది మండల అధ్యక్షులు, మరో 52 మంది మండల ఉపాధ్యక్షులుగా, 52 మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ఎన్నిక కానున్నారు. వీరితోపాటు 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, ఆరుగురు పురపాలక సంఘం అధ్యక్షులుగా పదవులు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి దాదాపు 1000 మంది ప్రజాప్రతినిధులు కొలువుదీరనున్నారు.

 ఓట్ల లెక్కింపు..
ఈనెల 12న జిల్లాలోని ఆరు మున్సిపాల్టీల ఓట్ల లెక్కింపు ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నారు. ఒక్కో మున్సిపాలిటీ ఒక్కో గదిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కోసం టేబుల్‌లు ఏర్పాటు చేశారు. ఆది లాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కోసం 12 టేబుల్‌లు, మంచిర్యాలకు 10, నిర్మల్, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కిం పుకు ఎనిమిదేసి టేబుల్‌లను ఏర్పాటు చేశారు.

  ఈనెల 13న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆసిఫాబాద్ డివిజన్‌కు సంబంధించి ఐటీడీఏ బాలికల వసతి గృహంలో, మంచిర్యాల డివిజన్‌కు సంబంధించి లక్సెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ పాఠశాలలో, ఆదిలాబాద్ డివిజన్‌కు సంబంధించి ఆదిలాబాద్ కొలాం ఆశ్రమ పాఠశాలలో, నిర్మల్ డివిజన్‌కు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్‌లో, ఉట్నూర్ డివిజన్‌కు సంబంధించి కేబీ కాంప్లెక్స్ ఉట్నూర్‌లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

 ఈనెల 16న శాసన, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement