సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం ముగియడంతో బరిలో నిలిచే నేతలెవరో తేటతెల్లమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు ఉండనుంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెనర్లు అభ్యర్థులకు మద్దతుగా ప్రచార పర్వంలోకి దిగుతున్నారు.
బీజేపీ తరఫున అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడం కోసం స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌కు రానున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, కల్వకుర్తిలో పర్యటించనున్నారు. ఇక టీఆర్‌ఎస్ తరఫున స్టార్ క్యాంపెనర్ అయిన ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పర్యటనలు ప్రతీ నియోజకవర్గంలో ఉండేలా ఖరారు చేశారు.
అందుకు అనుగుణంగా ఈనెల 25, 27 తేదీల్లో ఏడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా మహాకూటమి తరఫున 40 మంది స్టార్ క్యాంపెనర్లు కూడా ప్రచారానికి రానున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఉమ్మడి జిల్లాలోని గద్వాల లేదా కొండంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా పోలింగ్‌కు మిగిలిన 13 రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.
వేగం పెంచిన గులాబీ
ముందస్తు ఎన్నికల్లో మొదటి నుంచి దూకుడు మీద ఉన్న గులాబీ పార్టీ... నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో వేగాన్ని మరింత పెంచింది. ఇప్పటికే రెండు నెలలుగా ప్రచారంలో నిమగ్నమైన టీఆర్‌ఎస్ నేతలకు మద్దతుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇదివరకే మంత్రి కేటీఆర్.. ఉమ్మడి జిల్లాలో పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట్ల బహిరంగ సభలు నిర్వహించి కేడర్‌లో ఉత్సాహం తీసుకొచ్చారు.
అలాగే సీఎం కేసీఆర్ గత అక్టోబర్‌లో వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనగా... తాజాగా బుధవారం జడ్చర్ల ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక ఈనెల 25న దేవరకద్ర, నారాయణపేటలో జరగనున్న ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. అలాగే, ఈ నెల 27న కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
ఒకే రోజు జిల్లాలోని కల్వకుర్తి, మహబూబ్‌నగర్, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇలా మొత్తం మీద ఈ నెల 27 నాటికి ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి కానుంది. మిగతా ఆరు నియోజకవర్గాల ప్రచార షెడ్యూల్‌ను త్వరలో వెల్లడింనున్నారు.
కమలం.. దూకుడు
రానున్న ఎన్నికల సందర్భంగా పాలమూరు ప్రాంతం నుంచి ఎలాగైనా సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఒక వైపు క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూనే.. మరోవైపు ప్రజాకర్షణ కలిగిన నేతలను రంగంలోకి దింపుతోంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులను సైతం ప్రచారం చేయనున్నారు. అలాగే అతి కీలకమైన భావిస్తున్న నియోజవర్గాలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి జిల్లాలో బీజేపీకి కాస్త అవకాశాలు ఉన్న నారాయణపేట, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ స్థానాల్లో ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ పర్యటనలు ఖరారయ్యాయి.
ఇందులో భాగంగా ఈ నెల 27న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే డిసెంబర్ 2న నారాయణపేట, కల్వకుర్తిల్లో జరిగే ప్రచార సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.
గద్వాల లేదా కోస్గిలో రాహుల్ సభ
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అందుకు తగినట్లుగా వ్యూహరచన చేస్తోంది. మహాకూటమి పొత్తులు, టికెట్ల కేటాయింపులు, బుజ్జగింపులు తదితర విషయాలలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రెబెల్స్‌ను బుజ్జగించడంలో చతురత ప్రదర్శించి కొద్ది మేర సఫలమైంది.
అలాగే ప్రచారాన్ని కూడా హోరెత్తించేందుకు స్టార్ క్యాంపెనర్లను సిద్ధం చేసింది. ఇప్పటికే సిద్ధమైన 40 మంది ప్రచార కర్తలు శుక్రవారం నుంచి రంగంలోకి దిగనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుందని భావించే పాలమూరు ప్రాంతంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభ ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
రాహుల్ సభను గద్వాల లేదా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో నిమగ్నమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment