సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించేందుకు భారీగా జనం తరలివెళ్తున్న నేపథ్యంలో టూరిజం శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక ప్రాంతాల ప్యాకేజీలో భాగంగా కాళేశ్వరం ప్యాకేజీని డిజైన్ చేసింది. హైదరాబాద్ నుంచి నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే పర్యాటకులకు వీలుగా ఒకరోజు ప్యాకేజీని రూపొందించింది. ఈ మేరకు కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ నల్లా వెంకటేశ్వర్లుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ మనోహర్ లేఖ రాశారు. టూర్ ప్యాకేజీలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంప్‌హౌజ్, ప్యాకేజీ–6లోని టన్నెళ్లను సందర్శించేందుకు అనుమతి కోరారు. తమ వినతిపై వీలైనంత త్వరగా తమకు అనుమతులు ఇవ్వాలని విన్నవించారు.
రెండు లక్షల మంది సందర్శకులు..: ప్రాజెక్టును ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు నీటి పారుదల వర్గాల అంచనా. కేంద్ర జల సంఘం ఇంజనీర్లు, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, రాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్, టీఎస్‌పీఎస్సీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎన్‌ఆర్‌ఐ బృందాలు ప్రాజెక్టును చూసొచ్చాయి. ఇక కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ నేతృత్వంలో ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వంలో కార్పొరేటర్లు, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సతీశ్‌కుమార్, గొంగిడి సునీత, గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి నేతృత్వంలో వందల సంఖ్యలో రైతులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో ప్రత్యేక ప్యాకేజీ టూర్‌ను నిర్వహించేందుకు పర్యాటక శాఖ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment