విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం | Toxic fevers to the special treatment | Sakshi
Sakshi News home page

విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం

Published Mon, Aug 31 2015 4:08 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM

విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం - Sakshi

విషజ్వరాలకు ప్రత్యేక వైద్యం

- వెయ్యి మలేరియా, 100 డెంగీ కిట్స్ సరఫరా
- 80 కొత్తపడకల ఏర్పాటు, 50 పడకలకు ఆర్డర్
- అందుబాటులో 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్లు
- డీఎంఈ నుంచి 250 రక్తంబాటిళ్లు సరఫరా
- రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్
ఆదిలాబాద్ రిమ్స్ :
జిల్లాలో రోజు రోజుకు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లాకే తలమానికమైన రిమ్స్ ఆస్పత్రికి వందల సంఖ్యలో రోగులు వరుస కడుతున్నారు. వీరిలో అధిక శాతం  గిరిజన ప్రాంతాల వారే ఉంటున్నారు. రిమ్స్‌లో 650 మంది రోగులు ఉండగా.. 250 మంది జ్వర పీడితులే కావడం గమనార్హం. మలేరియా, డెంగీ, వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరందరికీ 24 గంటలు వైద్యసేవలు అందించేందుకు, అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఆస్పత్రి వర్గాలు ముందుకు సాగుతున్నాయి.

కలెక్టర్ జగన్మోహన్ రిమ్స్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. రోగులకు ఎలాంటి వైద్యసేవలు అందిస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో రోగులకు అందుతున్న వైద్యసేవలు, వారికి కల్పిస్తున్న సదుపాయాలపై రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు. విషజ్వర పీడితులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.
 
ప్రశ్న : జ్వరాలతో ఎంతమంది రోగులు చికిత్స పొదుతున్నారు.
జవాబు : ఆస్పత్రిలో 250 మంది జ్వరాలతో చికిత్స పొందుతున్నారు. ఇందులో 10 మలేరియా, ఐదు డెంగీ, 235 వైరల్ ఫీవర్ కేసులు ఉన్నాయి. జ్వరాల కు సంబంధించి నాలుగు వార్డులు ప్రత్యేకంగా ఏర్పా టు చేశాం. మరొకటి గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉంచాం. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతవాసులే 60 మంది చికిత్స పొందుతున్నారు.
ప్ర : రోగులకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయా..
జ : నూతన పడకల కోసం జిల్లా కలెక్టర్ జగన్మోహన్ రూ.4 లక్షల చెక్కు అందజేశారు. వంద పడకలు కొనుగోలు చేశాం. ఇప్పటికే 80 పడకలు ఏర్పాటు చేశాం. 20 పడకలు సిద్ధమవుతున్నాయి. ఇవేకాకుండా 30 పడకలు అద్దెకు తీసుకువచ్చాం.
ప్ర : మందుల కొరత లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.
జ :  సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని ఎలాం టి మందుల కొరత లేకుండా చూస్తున్నాం. ట్యాబ్లెట్‌తోపాటు మలేరియాకు సంబంధించిన 400 ఫాల్సిపేరస్ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉంచాం. ఇతర జ్వరాలకు సంబంధించి 400 క్వినీన్ శ్యాంపుల్స్, 50 ఈమాల్ ఇంజక్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సీడీసీ నుంచి మందులు తెచ్చుకోవడం జరుగుతుంది.
ప్ర : మలేరియా కిట్స్ కొరత ఉందా..
జ :  ప్రస్తుతం ఐటీడీపీఓ ద్వారా వెయ్యి మలేరియా కిట్స్ అందాయి. డెంగీకి సంబంధించి 500 ఎలిసా టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. రోగులు రిమ్స్‌కు వచ్చిన వెంటనే వారికి టెస్టు చేసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్య పరీక్షలు చేసి వార్డుకు పంపిస్తున్నాం.
ప్ర : ఇతర ప్రాంతాలకు రోగులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జ :  ఇప్పుడు రెఫరల్ కేసులు పూర్తిగా తగ్గించాం. ఎలాంటి వైద్యం అవసరమున్నా ఇక్కడే చేస్తున్నాం. రక్త పరీక్షల నుంచి వైద్య చికిత్స వరకు అన్ని అందుబాటులో ఉంచాం. ప్రతి రోజు రిమ్స్ నుంచి రెఫర్ కేసుల వివరాలు కలెక్టర్‌కు నివేదిస్తున్నాం. మలేరియా, డెంగీ వంటి జ్వరాల కేసులు కాకుండా రిమ్స్‌లో అందుబాటులో లేని వైద్య పరీక్షలకు మాత్రమే రెఫర్ చేస్తున్నాం.
ప్ర : వైద్యుల పర్యవేక్షణ ఎలా ఉంది.
జ :  సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రిమ్స్‌లో నీలోఫర్, ఉస్మానియా వైద్య బృందం చికిత్స చేస్తున్నారు. 11 మంది సభ్యుల ఉస్మానియా బృందం రోగులకు చికిత్స అందిస్తోంది. మరో పది రోజులపాటు వీరు రిమ్స్‌లోనే ఉంటారు. 24 గంటలు రోగుల పర్యవేక్షలో వైద్యులను ఉంచుతున్నాం.
ప్ర : రక్తహీనత రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.
జ :  ప్రస్తుతం రక్తహీనతతో చాలామంది రోగులు వస్తున్నారు. వీరి కోసం ఉచితంగా రక్తాన్ని ఎక్కిస్తున్నాం. రిమ్స్‌లో వివిధ రక్తగ్రూప్‌లతో 145 రక్తం బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి మరో 250 రక్తం బాటిళ్లు త్వరలో రిమ్స్‌కు రానున్నాయి. ఒకవేళ కావాల్సిన గ్రూప్ రక్తం అందుబాటులో లేకుంటే రెడ్‌క్రాస్‌ను సంప్రదిస్తాం.
ప్ర : రోగుల బంధువులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.
జ :  రోగులతో ఉండే బంధువుల్లో ఒకరికి భోజన వసతి కల్పిస్తున్నాం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్నాం. రోగుల సహాయార్థం భోజన శాల కూడా ఏర్పాటు చేశాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement