
పౌల్ట్రీఫాంలో విషవాయువులు
దంపతుల మృతి... మృతులు మహబూబ్‌నగర్ జిల్లా వాసులు
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగూడలోని ఓ పౌల్ట్రీఫాంలో వెలువడిన విషవాయువు పీల్చి దంపతులు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్న అది రాల గ్రామానికి చెందిన శేఖర్(40), పార్వతమ్మ(30) దంపతులు 15 రోజుల క్రితం కవ్వగూడ సమీపంలోని ఎం.మల్లారెడ్డి పౌల్ట్రీఫాంలో పనికి కుదిరారు. భార్యాభర్తలు అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఆదివారంరాత్రి పార్వతమ్మ వాంతులు చేసుకుంది. సోమవారం ఉదయం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఉస్మానియాకు తరలించాలని వైద్యులు సూచించారు. పరిస్థితి విషమించడంతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని సాయంత్రం స్వగ్రామానికి తీసుకెళ్లారు. అదే సమయంలో ఆమె భర్త శేఖర్ కూడా వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మహిళ మృతదేహంతో ఆందోళన: పౌల్ట్రీఫాం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే దం పతులు మృతి చెందారని బంధువులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం పార్వతమ్మ మృతదేహాన్ని పౌల్ట్రీఫాంకు తీసుకొచ్చి ఆందోళనకు దిగారు. పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చర్చలు జరుపుతున్నారు.