అధికార అహంకారమా!
♦ సీఎంపై ఉత్తమ్‌కుమార్ ఫైర్
♦ తెలంగాణ ఇచ్చిన సోనియా, మీరాకుమార్‌పైనే విమర్శలా?
♦ కేసీఆర్ సీఎం కావడం దౌర్భాగ్యమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘అధికారంలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కినయా? కుటుంబ సభ్యులంతా పదవుల్లో ఉన్నామనే అహంకారంతో మదమెక్కిందా? తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని, మీరాకుమార్‌ను విమర్శిస్తే ఉద్యమకారులు సహిస్తారా? నోటికొచ్చిన అబద్ధాలు, ఇచ్చిన మాటను గుర్తుచేస్తే దబాయింపులు, సిగ్గులేకుండా మాట మార్చడం.. తెలంగాణ రాష్ట్రానికి మొదటి సీఎంగా చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్ కావడం దౌర్భాగ్యం’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
రోజుకో కొత్త అబద్ధం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని సీఎం చేతకానితనాన్ని ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అభద్రతాభావంతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులతో కలసి గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందని, మీరాకుమార్ పట్టుదల వల్లే బిల్లు ఆమోదం పొందిందని చెప్పిన నోటితోనే కేసీఆర్ సిగ్గు లేకుండా విమర్శలు చేయడంపై తెలంగాణ ఉద్యమకారులు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల విషయంలో కోర్టుకు పోయినవారికి, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సింగరేణిలోని వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ జాగృతి కార్యకర్తనే కోర్టుకు పోయారు’’అని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. సిరిసిల్ల దళితులపై పోలీసుల థర్డ్ డిగ్రీకి కేసీఆర్ కుటుంబీకుల ప్రోద్బలమే కారణమన్నారు. హర్ష మోటార్స్ నుంచి హిమాన్షు కంపెనీ 300 ఇన్నోవా వాహనాలు కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా చేసిన దోపిడీకి కేసీఆర్ కుటుంబీకులు క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాయాలన్నారు. ‘‘మూడేళ్లలోనే హైదరాబాద్‌లో 50 పబ్‌లకు అనుమతి ఎందుకు ఇచ్చారు? అ పబ్‌లు ఎవరివి? ఈవెంట్ మేనేజర్లు ఎవరి బంధువులు? ఈ విషయాలన్నీ సీఎం చెప్పాలి.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేదు’’ అని అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో, ఎడాపెడా అప్పులు చేయడంలో రాష్ట్రాన్ని నంబన్–1గా మార్చారని విమర్శించారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు కడుపు మండిన బాధితులు కోర్టులకు పోతే కాంగ్రెస్‌పై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను తిట్టడానికి అయినా సీఎం ప్రజల్లోకి వస్తే వాస్తవాలేమిటో తేలుతాయన్నారు.