త్వరలో టీపీసీసీ కార్యవర్గం!
ఈ నెల 22 లేదా 23న ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కార్యవర్గానికి ఏఐసీసీ ఆమోదం లభించింది. ఈ నెల 22 లేదా 23న కార్యవర్గాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు దాదాపు 40 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను కూడా మార్చే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయినవారే ప్రస్తుతం వాటికి ఇన్‌చార్జిలుగా ఉన్నారు. సుమారు 40 మంది ఇన్‌చార్జిలు పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఏఐసీసీకి నివేదికలు అందినట్టుగా తెలిసింది. దీంతో వీరిని ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. టీపీసీసీలో ఇప్పటిదాకా ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధా న కార్యదర్శులు, అధికార ప్రతినిధుల సంఖ్యను ఏఐసీసీ పది శాతానికి పరిమితం చేసి ఆమోదించినట్టుగా తెలుస్తోంది.
వంద మంది కార్యదర్శులుం డగా ఆ సంఖ్య 10కి పరిమితమైనట్టుగా సమాచారం. పార్టీ ముఖ్య నేతలు అందించిన సమాచారం ప్రకారం.. 10 మంది ఉపాధ్యక్షులు, 12 మంది అధికార ప్రతినిధులు, 10 మంది ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఉండే అవకాశముంది. ఈ జాబితాలో సగానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉన్నారు. పదవులను అలంకారప్రాయంగా వాడుకునే వారికి కాక పనిచేయడానికి ఆసక్తి, సమర్థత, అంకితభావం ఉన్నవారికే అవకాశం కల్పించినట్టుగా టీపీసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు.
పని విభజన తర్వాత బాధ్యతలు
పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన చేసి బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. ఒక్కో నాయకుడికి ఐదారు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పార్టీ నిర్మాణం, కార్యక్రమాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల వ్యక్తిగత పనితీరుపై ఎప్పటికప్పుడు టీపీసీసీకి నివేదించాల్సిన బాధ్యతలను అప్పగించనున్నారు. అధికార ప్రతినిధులకు కూడా జాతీయ, రాష్ట్ర అంశాలు, మీడియా వ్యవహారాలు, పార్టీ వైఖరిపై శిక్షణా శిబిరాలు వంటి వాటిలో పని విభజన చేయనున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగా ఉంటున్న నియోజకవర్గ ఇన్‌చార్జిలను తప్పించనున్నారు. ఆ నియోజకవర్గాలకు కొత్తవారిని నియమించడమా, ఐదారుగురు నాయకులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయడమా అన్నది త ర్వాత నిర్ణయించనున్నారు. ఈ మధ్య కొందరు నాయకులు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ఒక పత్రికలో కాంగ్రెస్ విధానానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాసిన ఒక అధికార ప్రతినిధికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టుగా తెలిసింది.