సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నాగార్జున సాగర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా చర్చ జరిగింది. దీనిలో భాగంగా మున్సిపాలిటీలు, జిల్లాల వారీగా త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, సెలెక్ట్ అండ్ ఎలక్ట్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్న టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలంతా తీసుకోవాలని నిర్ణయించింది.
ఎట్టి పరిస్థితుల్లో 50 శాతానికి పైగా మున్సిపల్ పీఠాలను దక్కించుకోవాలని, కనీసం 70 స్థానాల్లో పాగా వేయాలనే వ్యూహం తో కార్యాచరణ రూపొందించుకున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ తెలిపారు. గత సమావేశాలకు భిన్నంగా సాగర్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ పెద్దలు దిశానిర్దేశం చేశారన్నారు. మున్సిపాలిటీల వారీగా వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాగంగా రాహు ల్ రాజీనామా, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, సెక్రటేరియట్ కూల్చివేత అంశాలను చర్చించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పులిచింతల, పోతిరెడ్డిపాడు విషయాల్లో నాటి వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు గోదా వరి నీళ్లను శ్రీశైలానికి తరలించే ప్రతిపాదన చేయడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతమున్న సచివాలయ భవనాలను కూల్చవద్దని, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా సోమవారం సచివాలయాన్ని, త్వరలో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని లోపాలను వివరిస్తూ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించారు.
ఎవరి ప్రాంతాల్లో వారికే బాధ్యతలు...
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని నేతలకు మాత్రమే అప్పగించాలని, కమిటీల పేరుతో ఇతరులను పంపి గందరగోళం చేయవద్దని కోరారు. ఈ సందర్భంలో టీపీసీసీ ప్రొటోకాల్ విభాగం చైర్మన్ హర్కర వేణుగోపాల్, మాగం రంగారెడ్డి కల్పించుకుని మాట్లాడబోగా, జగ్గారెడ్డి వారిపై మండిపడినట్లు సమాచారం. తాను మాట్లాడేటప్పుడు జోక్యం చేసుకోవద్దని ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది.
ఒకరిద్దరు మినహా...
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగర్‌లో నిర్వహించిన సమావేశానికి ఒకరిద్దరు మినహా దాదాపు నేతలంతా హాజరయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి హాజరు కాగా, పొడెం వీరయ్య మాత్రం రాలేదు. పార్టీ షోకాజ్ నోటీసులందుకున్న రాజగోపాల్‌రెడ్డి కూడా గైర్హాజరయ్యారు. ఇక, తన సోదరుడు రమేశ్ మర ణించడంతో ఆయన భౌతికకాయాన్ని తీసుకువచ్చేందుకు ముంబై వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా సమావేశానికి రాలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment