ప్రచారంలో భాగంగా నల్లగొండలో చాయ్ తయారు చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తామే గెలుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాల్లో విజయం తమదేనని, తమకు దూరం గా రెండో స్థానంలో టీఆర్‌ఎస్ ఉంటే, బీజేపీ అసలు పోటీలోనే లేదని ఆయన వ్యాఖ్యానిం చారు. ఈ విషయాన్ని తాను ఊహించి చెప్పడం లేదని, ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన అలా ఉందని అన్నారు. తెలంగాణను టీఆర్‌ఎస్ నాశనం చేసిందని వ్యాఖ్యానించిన ఉత్తమ్.. పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేయకపోగా, మిషన్ భగీరథ నీళ్లిస్తామంటూ పట్టణాల్లోని రోడ్లను ధ్వంసం చేశారు తప్ప ఒక్క ఇంటికి కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు రెండూ కలసి బీజేపీకి సహకరిస్తున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివి...!
వీళ్లు చేసిందేంటో ప్రజలకు తెలుసు..
నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌర వం, స్వయంపాలన, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. పట్టణాలను, నగరాలను మురికి కూపాలుగా మార్చడమే తప్ప ఆరేళ్లలో టీఆర్‌ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదు. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచలేదు. రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కోసం ఇంకా రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా నిర్వహించలేక ప్రజలు జ్వరాల బారిన పడిన సంగతి తెలియదా? టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓట్లేయాలి? ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటున్నారు.
నిరుద్యోగులను మోసం చేశారు..
పట్టణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు తెలియదు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పెద్ద పెద్ద మాటలు, పోజులు, మీడియా ఫోకస్ తప్ప రాష్ట్రానికి కేటీఆర్ చేసిందేమీ లేదు. టీఆర్‌ఎస్ హయాంలో లక్షల మందికి ఉపాధి కల్పించాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకుండా పోయింది. వీళ్లు సొంతంగా ఉద్యోగాలు కల్పించలేదు. కనీసం ఉపాధి సాయం చేయలేదు. పట్టణ నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు.
అధికార దుర్వినియోగం..
అధికార దుర్వినియోగం చేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తోం ది. ఒక మంత్రి మల్లారెడ్డి కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటుంటే మరో మంత్రి దయాకర్‌రావు ఓట్లు ఎవరికి వేస్తారో తనకు తెలుస్తుం దని అంటున్నారు. ఒకవేళ టీఆర్‌ఎస్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి ఉంటే మన్సిపల్ ఎన్నికల్లో ఇన్ని రకాల అవకతవకలకు పాల్పడాల్సిన అవసరం లేదు కదా.. పారదర్శకంగా ఎన్నికలకు ఎందుకు వెళ్లడం లేదు? ఓటర్ల జాబితాలో అవకతవకలు, రిజర్వేషన్లలో లోపాయికారి ఒప్పం దాలు ఎందుకు జరిగాయి. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు సమయం లేకుండా ఆదరాబాదరగా ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారు. ఓడిపోతే పదవులు పోతాయని మంత్రులను ఎందుకు బెదిరిస్తున్నారు.
పక్కా ప్రణాళికతో..
మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం ముందు నుంచి మేం ప్రణాళికతో వెళ్తున్నాం. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకుని పనిచేశాం. పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, డీసీసీ అధ్యక్షులు, పట్టణ నేతలతో సమన్వయంతో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేశాం. మా పార్టీ అభ్యర్థులను నయానా భయానా లోబర్చుకునే ప్రయత్నం చేసినా తలొగ్గలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పట్టణ ప్రాంత ఓటర్లను అభ్యర్థిస్తున్నా. మేం గెలిస్తే ఏం చేస్తామో ఇప్పటికే కామన్ మేనిఫెస్టో రూపంలో ప్రజలకు చెప్పాం. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తామేం చేస్తామో చెప్పి ప్రజలను ఓట్లడుగుతున్నాం. ప్రధానంగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. మా కార్యకర్తలే మాకు బలం. వారే మాకు విజయ సారథులు. తెలంగాణలో పటిష్ట కేడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం ఈ ఎన్నికల్లో తథ్యం.
బీజేపీకి టీఆర్‌ఎస్.. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం!
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, ఎంఐఎంలు మోదీ కోసమే పనిచేస్తున్నాయి. దేశంలో మోదీ ఇంత బలంగా అయ్యేందుకు సహకరించింది టీఆర్‌ఎస్ కాదా? దాదాపు 10 ప్రధానమైన అంశాల్లో బీజేపీకి టీఆర్‌ఎస్ మద్దతిస్తే ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఎందుకు ఉంటోంది? సీఏఏను నిజంగానే టీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తే ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం లేదు? ఈ విషయంలో ఎంఐఎం ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని మేం పదే పదే డిమాండ్ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ విషయాలను మైనార్టీలు గమనించాలి. రాష్ట్రంలోనే అతి పెద్ద సామాజిక వర్గమైన మాదిగ కులస్తులకు కేసీఆర్ కేబినెట్‌లో స్థానం ఉందా? ఈ రెండు వర్గాలకు చెందిన ఓట్లలో ఒక్కటి కూడా టీఆర్‌ఎస్‌కు పడదు.
Comments
Please login to add a commentAdd a comment