executive meeting TPCC
-
ప్రాజెక్టు నిర్మాణాల్లో అవినీతిని ఎండగడతాం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ఎండగడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణాలపై లోతైన పరిశీలన చేసి ప్రజలకు వివరించేందుకు పార్టీ తరఫున సీనియర్ నేతలు, మరికొంత మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణను ఆయన మీడియాకు వివరించారు. ఈ అంశాన్ని పార్టీలో మరోసారి చర్చించి తమ విధానాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు. తమ పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామనే వాదన సరికాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల రీడిజైన్, అంచనా వ్యయాలను రెండింతలు చేయడంలో అవినీతి కోణం ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కనీసం శ్వేతపత్రం కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా బ్యాంకులకు ఏం అంకెలు చూపుతున్నారు? బ్యాంకర్లు ఎలా రుణాలు ఇస్తున్నారో తెలుసుకుంటామన్నారు. సచివాలయ భవనాలను కూల్చడమెందుకు? ఇంకా 50 ఏళ్ల ఆయుష్షు ఉన్న సచివాలయ భవనాలను కూల్చేయడం సరికాదని ఉత్తమ్ అన్నారు. భవనాల పరిశీలనకు పార్టీ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఖాళీగా ఉన్న పార్టీ పదవులను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించామని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడి హోదాలో బీఫాంలు ఇచ్చే అధికారం పీసీసీ అధ్యక్షుడిదే అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన లేదా ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ఆ మున్సిపాలిటీ లేదా నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఇతర ముఖ్యనేతలతో కూడిన కమిటీలను ప్రతిపాదించాలని సూచించామని చెప్పారు. పార్టీ పదవుల భర్తీ పీసీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఇలా.. ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. సీఎల్పీనీ టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడం, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎల్పీ అంశం కోర్టులో ఉందని, తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు. పార్టీకి ఎవరూ అతీతులు కారని, పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా, పార్టీ నిర్ణయాలు ధిక్కరించినా చర్యలు ఉంటాయని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనిని నిరసిస్తూ రెండు, మూడు వారాల్లో జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. పార్టీ సీనియర్ నేత, దివంగత మల్లు అనంతరాములు కుమారుడు రమేష్ మృతికి పార్టీ సంతాపం తెలిపిందని చెప్పారు. -
50 శాతానికి పైగా గెలవాలి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న పురపాలిక ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన శనివారం నాగార్జున సాగర్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గం, ఆఫీస్ బేరర్లు, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా చర్చ జరిగింది. దీనిలో భాగంగా మున్సిపాలిటీలు, జిల్లాల వారీగా త్వరలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, సెలెక్ట్ అండ్ ఎలక్ట్ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్న టీపీసీసీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతను పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలంతా తీసుకోవాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో 50 శాతానికి పైగా మున్సిపల్ పీఠాలను దక్కించుకోవాలని, కనీసం 70 స్థానాల్లో పాగా వేయాలనే వ్యూహం తో కార్యాచరణ రూపొందించుకున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ తెలిపారు. గత సమావేశాలకు భిన్నంగా సాగర్‌లో జరిగిన సమావేశంలో టీపీసీసీ పెద్దలు దిశానిర్దేశం చేశారన్నారు. మున్సిపాలిటీల వారీగా వ్యూహాలు సిద్ధం చేసుకునేందుకు త్వరలోనే సమావేశాలు నిర్వహిస్తామని, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో భాగంగా రాహు ల్ రాజీనామా, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, సెక్రటేరియట్ కూల్చివేత అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పులిచింతల, పోతిరెడ్డిపాడు విషయాల్లో నాటి వైఎస్సార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు గోదా వరి నీళ్లను శ్రీశైలానికి తరలించే ప్రతిపాదన చేయడాన్ని తప్పుపట్టారు. ప్రస్తుతమున్న సచివాలయ భవనాలను కూల్చవద్దని, ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా సోమవారం సచివాలయాన్ని, త్వరలో ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించారు. కాళేశ్వరంలోని లోపాలను వివరిస్తూ తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర నిర్వహిస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఎవరి ప్రాంతాల్లో వారికే బాధ్యతలు... సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని నేతలకు మాత్రమే అప్పగించాలని, కమిటీల పేరుతో ఇతరులను పంపి గందరగోళం చేయవద్దని కోరారు. ఈ సందర్భంలో టీపీసీసీ ప్రొటోకాల్ విభాగం చైర్మన్ హర్కర వేణుగోపాల్, మాగం రంగారెడ్డి కల్పించుకుని మాట్లాడబోగా, జగ్గారెడ్డి వారిపై మండిపడినట్లు సమాచారం. తాను మాట్లాడేటప్పుడు జోక్యం చేసుకోవద్దని ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది. ఒకరిద్దరు మినహా... మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగర్‌లో నిర్వహించిన సమావేశానికి ఒకరిద్దరు మినహా దాదాపు నేతలంతా హాజరయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలకు గాను శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి హాజరు కాగా, పొడెం వీరయ్య మాత్రం రాలేదు. పార్టీ షోకాజ్ నోటీసులందుకున్న రాజగోపాల్‌రెడ్డి కూడా గైర్హాజరయ్యారు. ఇక, తన సోదరుడు రమేశ్ మర ణించడంతో ఆయన భౌతికకాయాన్ని తీసుకువచ్చేందుకు ముంబై వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా సమావేశానికి రాలేకపోయారు. -
గీత దాటితే వేటే
♦ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కఠిన నిర్ణయం ♦ పార్టీ సీనియర్లు క్రమశిక్షణ ఉల్లంఘించినా అంతే.. ♦ పార్టీ నిర్ణయాలకు పీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి ♦ ఈ నెలాఖరులోగా మండల స్థాయి దాకా కమిటీలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధానానికి, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎంత సీనియర్ నాయకుడు మాట్లాడినా వేటు వేయాల్సిందేనని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో జరిగింది. సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధిగా ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ప్రత్యేకంగా హాజరయ్యారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సుమారు 6 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో నెలకొన్న శూన్యత, బహునాయకత్వంతో సమస్యలు, పార్టీ నేతల ఇష్టారాజ్య ప్రకటనలు, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం, ప్రభుత్వ వ్యవహారశైలి, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం వివరాలను పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి, నాగయ్య, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మీడియాకు వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్లీనరీ అంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని మల్లు రవి విమర్శించారు. టీఆర్ఎస్ తీరుపై ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. భేటీలో తీసుకున్న నిర్ణయాలివీ... ♦ ఇకపై రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలకు టీపీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి. ♦ పార్టీ నియమాలు, నిబంధనలు, జాతీయస్థాయి విధానం, వైఖరికి వ్యతిరేకంగా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా కఠినంగా వ్యవహరించాలి. ♦ పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించి క్రమశిక్షణారాహిత్యంపై చర్యలు తీసుకునే అధికారాలు అప్పగించాలి. ♦ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే నేతలపై దృష్టిపెట్టాలి. ♦ నియోజకవర్గాలవారీగా కార్యకర్తల బ్యాంకును ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి 30 మంది చురుకైన కార్యకర్తల జాబితాను రూపొందించాలి. ♦ ఒక్కో జిల్లాకు ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు ఇన్చార్జులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. ♦ ప్రతి మూడు నెలలకోసారి సమన్వయ, కార్యనిర్వాహక కమిటీలు సమావేశాలు నిర్వహించాలి. ♦ ఈ నెలాఖరులోగా ఖాళీగా ఉన్న జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో వాటిని పునర్వ్యవస్థీకరించాలి. ♦ ఇప్పటిదాకా ఉన్న కార్యదర్శులు, అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ కొత్తగా ఐదారు రోజుల్లోగా నియమించడానికి చర్యలు చేపట్టాలి.