సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ఎండగడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణాలపై లోతైన పరిశీలన చేసి ప్రజలకు వివరించేందుకు పార్టీ తరఫున సీనియర్ నేతలు, మరికొంత మంది నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శనివారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణను ఆయన మీడియాకు వివరించారు. ఈ అంశాన్ని పార్టీలో మరోసారి చర్చించి తమ విధానాన్ని ప్రకటించనున్నట్లు చెప్పారు.
తమ పార్టీ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నామనే వాదన సరికాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల రీడిజైన్, అంచనా వ్యయాలను రెండింతలు చేయడంలో అవినీతి కోణం ఉందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని, కనీసం శ్వేతపత్రం కూడా విడుదల చేయడం లేదని విమర్శించారు. ప్రధానంగా బ్యాంకులకు ఏం అంకెలు చూపుతున్నారు? బ్యాంకర్లు ఎలా రుణాలు ఇస్తున్నారో తెలుసుకుంటామన్నారు.
సచివాలయ భవనాలను కూల్చడమెందుకు?
ఇంకా 50 ఏళ్ల ఆయుష్షు ఉన్న సచివాలయ భవనాలను కూల్చేయడం సరికాదని ఉత్తమ్ అన్నారు. భవనాల పరిశీలనకు పార్టీ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఖాళీగా ఉన్న పార్టీ పదవులను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించామని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షుడి హోదాలో బీఫాంలు ఇచ్చే అధికారం పీసీసీ అధ్యక్షుడిదే అయినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన లేదా ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ఆ మున్సిపాలిటీ లేదా నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆఫీస్ బేరర్లు, ఇతర ముఖ్యనేతలతో కూడిన కమిటీలను ప్రతిపాదించాలని సూచించామని చెప్పారు.
పార్టీ పదవుల భర్తీ
పీసీసీ సభ్యులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు ఇలా.. ఖాళీగా ఉన్న పార్టీ పదవులను భర్తీ చేయనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. సీఎల్పీనీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయడం, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎల్పీ అంశం కోర్టులో ఉందని, తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు. పార్టీకి ఎవరూ అతీతులు కారని, పార్టీ వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా, పార్టీ నిర్ణయాలు ధిక్కరించినా చర్యలు ఉంటాయని ఏఐసీసీ స్పష్టం చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు పెరిగిపోతున్నాయని, దీనిని నిరసిస్తూ రెండు, మూడు వారాల్లో జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. పార్టీ సీనియర్ నేత, దివంగత మల్లు అనంతరాములు కుమారుడు రమేష్ మృతికి పార్టీ సంతాపం తెలిపిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment