గీత దాటితే వేటే
♦ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కఠిన నిర్ణయం
♦ పార్టీ సీనియర్లు క్రమశిక్షణ ఉల్లంఘించినా అంతే..
♦ పార్టీ నిర్ణయాలకు పీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి
♦ ఈ నెలాఖరులోగా మండల స్థాయి దాకా కమిటీలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విధానానికి, క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఎంత సీనియర్ నాయకుడు మాట్లాడినా వేటు వేయాల్సిందేనని టీపీసీసీ నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ నూతన కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగింది. సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధిగా ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు ప్రత్యేకంగా హాజరయ్యారు.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సుమారు 6 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీలో నెలకొన్న శూన్యత, బహునాయకత్వంతో సమస్యలు, పార్టీ నేతల ఇష్టారాజ్య ప్రకటనలు, పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం, ప్రభుత్వ వ్యవహారశైలి, పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. సమావేశం వివరాలను పార్టీ ఉపాధ్యక్షులు మల్లు రవి, నాగయ్య, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాకు వివరించారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్లీనరీ అంటూ బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని మల్లు రవి విమర్శించారు. టీఆర్‌ఎస్ తీరుపై ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
భేటీలో తీసుకున్న నిర్ణయాలివీ...
♦ ఇకపై రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన అన్ని నిర్ణయాలకు టీపీసీసీ అధ్యక్షుడే సర్వాధికారి.
♦ పార్టీ నియమాలు, నిబంధనలు, జాతీయస్థాయి విధానం, వైఖరికి వ్యతిరేకంగా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా కఠినంగా వ్యవహరించాలి.
♦ పార్టీలో క్రమశిక్షణా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించి క్రమశిక్షణారాహిత్యంపై చర్యలు తీసుకునే అధికారాలు అప్పగించాలి.
♦ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే నేతలపై దృష్టిపెట్టాలి.
♦ నియోజకవర్గాలవారీగా కార్యకర్తల బ్యాంకును ఏర్పాటు చేయాలి. నియోజకవర్గానికి 30 మంది చురుకైన కార్యకర్తల జాబితాను రూపొందించాలి.
♦ ఒక్కో జిల్లాకు ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యదర్శులు ఇన్‌చార్జులుగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.
♦ ప్రతి మూడు నెలలకోసారి సమన్వయ, కార్యనిర్వాహక కమిటీలు సమావేశాలు నిర్వహించాలి.
♦ ఈ నెలాఖరులోగా ఖాళీగా ఉన్న జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో వాటిని పునర్వ్యవస్థీకరించాలి.
♦ ఇప్పటిదాకా ఉన్న కార్యదర్శులు, అధికార ప్రతినిధులను రద్దు చేస్తూ కొత్తగా ఐదారు రోజుల్లోగా నియమించడానికి చర్యలు చేపట్టాలి.