న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్‌పై అభ్యంతరకరమైన, హింసాత్మక ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు.
బీజేపీ, తమ అనుబంధ పార్టీల నేతలు ఉపయోగించే అసభ్యకరమైన భాష భవిష్యత్తు తరాలకు ప్రమాదకరమని ఖర్గే తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. ‘బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మంత్రి, రాహుల్‌ను ‘నంబర్ వన్ టెర్రరిస్ట్’గా పలిచారు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వంలోని ఓకూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే(శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్) రాహుల్ నాలుక కోస్తే వారికి రూ.11 రివార్డును ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోని ఓ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాహుల్‌పై దాడి చేస్తామని బహరంగంగా బెదిరిస్తున్నారు.
చదవండి:అతిషీ మర్లీనా ‘డమ్మీ సీఎం’: స్వాతి మాలీవాల్
భారత సంస్కృతి అహింస, సామరస్యం, ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మన లీడర్లు రాజకీయాల్లో ఈ పాయింట్లను ప్రమాణాలుగా స్థాపించారు. బ్రిటీష్ పాలనలోనే గాంధీజీ ఈ ప్రమాణాలను రాజకీయాల్లో ముఖ్యమైన భాగంగా చేశారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంటరీ రంగంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య గౌరవప్రదమైన ఒప్పందాలు కుదిరిన చరిత్ర ఉంది. ఇది భారత ప్రజాస్వామ్య ప్రతిష్టను పెంచడానికి పనిచేసింది.
ఈ విషయంపై కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి విద్వేషపూరిత శక్తుల వల్ల జాతిపిత మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది. అధికార పార్టీ ఈ రాజకీయ ప్రవర్తన ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దారుణమైన ఉదాహరణ. మీ నేతలు వెంటనే హింసాత్మక ప్రకటనలు చేయడం మానేయాలి. ఇందుకు మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment