మంచిమాట
ఈ భూమి మీద విజయం సాధించిన వారంతా కేవలం తామొక్కరుగానే ఆ విజయాన్ని సాధించలేదు. వారందరికీ ఏదో సమయంలో అనేక మంది సహకరించడం వల్లనే ఆ విజయం సం్రపాప్తించిందన్నది జగమెరిగిన సత్యం. ఏ మనిషైనా ఎన్ని ప్రతిభా సామర్ధ్యాలున్నప్పటికీ, ఎంతటి పండితులైనప్పటికీ, అపారమైన మేధో సంపత్తి ఉన్నప్పటికీ, ఆయా సామర్థ్యాలను సాధించడానికి వారు చేసిన కృషి ఒక ఎత్తయితే, ఆ కృషి చేయడానికి సహకరించిన చేతులు అనేకం అని చెప్పక తప్పదు.
ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి గురించి మాట్లాడినపుడు వారు పడిన శ్రమను, కష్టం గురించి మాట్లాడడం జరుగుతుంది తప్ప, వారికి అంతర్లీనంగా సహకరించిన పెద్దలను, మహనీయులను, గురువులను, స్నేహితులను, మిత్రులను గాలికి వదిలేస్తాం. నిజానికి వారందరి సహకారం లేనిదే ఆ వ్యక్తి అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుని ఉండేవారు కాదన్నది వాస్తవం. ఒకవేళ ఆ వ్యక్తి తనకు తానుగా గొప్పవాడిగా భావించుకుని అందరినీ దూరంగా జరిపితే ఆయా విజయాల దరిదాపుల్లోకి వెళ్ళేవాడు కాదన్నది అక్షరాల నిజం. అందుకే కలిసుంటే కలదు సుఖమే కాదు... అది జీవిత సత్యంగా కూడా ఆకళింపు చేసుకోవాలి.
మన పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ ఏ ఒక్క యుగ పురుషుడు కూడా ఐకమత్యం సాధించకుండా విజయ బావుటా ఎగురవేయలేదన్న విషయంలో ఎంత వాస్తవం ఉందో, ఐకమత్యం లేకపోతే ఆ విజయాలు సాధ్యం కావన్న విషయంలోనూ అంతే నిజం ఉంది.
అందువల్ల ఏదైనా ముఖ్యమైన విజయాన్ని సాధించడానికి, అత్యంత అవసరమైన అంశం ఐకమత్యం. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐకమత్యం అండగా నిలుస్తుంది. కనుక మన భవిష్యత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి అన్ని శక్తులు, సామర్థ్యాలు, వనరులు వాడుకోవాలి. ఇవన్నీ ఏ ఒక్కరిలోనో ఉండవు. సహాయం, సహకారం అవసరమున్నప్పుడు అర్ధించడం బలహీనతకు సూచన కాదు. అది వివేకవంతుల లక్షణం కూడా.
దుష్టశిక్షణ శిష్ట రక్షణ చేయడానికి సాక్షాత్తు ఆ జగన్మాతే ఐకమత్యంతో అసురులపై విజయం సాధించింది. చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి జగజ్జేతగా నిలిచింది. ఆ జగన్మాతకు విజయం దక్కడానికి ముక్కోటి దేవతలు ఒక్కటయ్యారు. తమకు కంటకంగా మారిన అసురులను సంహరించడానికి ఆ తల్లికి సహకరించారు. సృష్టి స్థితి, లయాలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు, ముక్కోటి దేవతలు ఆ తల్లికి తమకున్న శక్తులన్నింటినీ ధారపోశారు. తమకున్న అపార యంత్ర, తంత్ర, అద్వితీయ శక్తులను జగన్మాతకు ఇచ్చి, ఆ తల్లిని శక్తి స్వరూపిణిగా నిలబెట్టారు. చివరకు అసుర సంహారం చేశారు.
అందువల్ల మన నిజమైన సామర్థ్యాలు మన ఒక్కరిలో ఉన్నవే కాదు. మన తోటి వాళ్ళందరితో కలిసి ఉంటేనే అవి సర్వశక్తిమంతులుగా మార్చుతాయి. ఇది ఐకమత్యంతోనే సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గుర్తెరిగి మసలుకుని విజయులమవుదాం.
ఐకమత్యమే మహాబలం, మహాభాగ్యం అన్నారు పెద్దలు. అవును నిజమే.. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యంగా ఉంటే ఎన్నో పనులు చెయ్యచ్చు.. శత్రువులను సైతం తరిమి తరిమి కొట్టచ్చు. ఎలాంటి దుస్సాధ్యమైన పనైనా సునాయాసంగా చేయచ్చు. ఐకమత్యం బలాన్ని, ప్రేమను, అనురాగాలను పెంచుతుంది. ఇది నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏకత్వాన్ని సూచిస్తుంది, ఆనందాన్నిస్తుంది. కష్టాలలో పాలు పంచుకునే అవకాశాన్నిస్తుంది. శక్తిని, విశ్వాసాన్ని పెంచుతుంది. ఏకత్వాన్ని కలిగిస్తుంది. వ్యక్తుల మధ్య అంతరాలను తగ్గిస్తుంది. జీవితంలోని సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించడానికి ఇది మనకు ఎంతగానో దోహదం చేస్తుంది.
– దాసరి దుర్గా ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment