
గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. చిత్రంలో పొన్నాల లక్ష్మయ్య
♦ గవర్నర్‌కు టీపీసీసీ నేతల ఫిర్యాదు
♦ ఆదుకోవాలని వినతిపత్రం అందజేత
♦ రాష్ట్రమంతా కరువు మండలాలుగా ప్రకటించాలి: ఉత్తమ్
♦ క్షేత్రస్థాయి పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీపీసీసీ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, టీపీసీసీ ముఖ్య నేతలు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలిశారు. కరువు తీవ్రత నుంచి ప్రజలను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలంటూ వినతిపత్రం సమర్పించారు.
ప్రజలు కరువుతో అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని, ప్లీనరీలంటూ ప్రజల సొమ్ముతో ఆడంబరాలు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పశుగ్రాసం, తాగునీరు లేక గ్రామాల్లో రైతులు పశువులను కబేళాలకు అమ్ముకుంటున్నారని వివరించారు. చరిత్ర లో ఎన్నడూలేని విధంగా కరువు నెలకొందని...అందువల్ల దీన్ని జాతీయ ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుని సూచనలు చేయాలని టీపీసీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజ్‌భవన్ ముందు మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ కరువుపై పూర్తిస్థాయి నివేదికలు, సమాచారం తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రమంతా కరువు ఉన్నా ప్రభుత్వం కేవలం 230 మండలాలనే కరువు మండలాలుగా గుర్తించి చేతులు దులుపుకుందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
కరువుపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశా రు. కరువును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పశువులకు తాగునీటికోసం తొట్లు, పశుగ్రాసం వంటివి ప్రభుత్వమే చేయాలని కోరారు. పాలేరు ఉప ఎన్నిక సమయంలో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్లీనరీయా?
రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే నాలుగు వేల మంది టీఆర్‌ఎస్ నేతలు ప్లీనరీ పేరుతో పండుగ చేసుకుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గవర్నర్‌ను కలసిన నేతల్లో దాసోజు శ్రవణ్, ఉద్దెమర్రి నర్సింహారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, నేరేళ్ల శారద, బండ కార్తీకరెడ్డి, జి.నారాయణరెడ్డి తదితరులున్నారు.