
రైతు సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటం: టీ.పీసీసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ ఉపాధ్యక్షులు, ముఖ్య నేతలు శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆర్టీఐ చట్టం ఒక మాఫియాగా మారిందని గవర్నరు ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడటం సరికాదని వీహెచ్ అన్నారు. దీనిపై పార్టీ తరపున పోరాటం చేయాలని కోరారు. గవర్నర్‌పై రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు చేయాల్సిందిగా డిమాండ్ చేయాలని సూచించారు. వీహెచ్ ప్రతిపాదనను పీసీసీ పరిశీలిస్తోంది. కరువు బారిన రైతులను ఆదుకోవడంపై, వరదల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయడంపై టీఆర్‌ఎస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని నేతలు విమర్శించారు.