-గవర్నర్‌కు వేర్వేరుగా కాంగ్రెస్, బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్‌ఎస్ అడ్డదారులు తొక్కుతోందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు కాంగ్రెస్ కమిటీ, భారతీయ జనతా పార్టీ నేతలు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని, పునర్విభజన మొదలు రిజర్వేషన్ల ఖరారు వరకు ఇదే రీతిన వ్యవహరించిందని వివరించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, నాగేందర్ తదితరులు శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం టీఆర్‌ఎస్ అక్రమాలకు అదుపూ,హద్దూ లేకుండా పోయాయని విమర్శించారు. గ్రేటర్‌లోని లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పునర్విభజనను తమ పార్టీకి, ఎంఐఎంకు అనుకూలంగా చేశారన్నారు.
ఇష్టానుసారంగా ఎన్నికల ప్రక్రియ: బీజేపీ నేత లక్ష్మణ్
ప్రతిపక్షాలు ఎన్నికల కోసం ఏమాత్రం సమాయత్తం కావద్దనే ఉద్దేశంతో ఎన్నికల ప్రక్రియను కుదించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించిందని బీజేపీ విమర్శించింది. గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అనంతరం బీజేఎల్‌పీ నేత కె. లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజాస్వామ్య పద్ధతులను పక్కనబెట్టి ఇష్టానుసారంగా వ్యవరిస్తోందన్నారు. వార్డుల రిజర్వేషన్ల వివరాలు టీఆర్‌ఎస్, ఎంఐఎంకు మాత్రమే తెలిసేలా వ్యవహరించి, ప్రతిపక్షాలకు సమాచారం లేకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారన్నారు.