
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు ట్రాఫిక్ గండం పొంచివుంది. సెప్టెంబర్ 2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరగనున్న టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభకు వేలాది వాహనాలు పోటెత్తనుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. దీనికితోడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కూడా తోడవుతుండటంతో హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు ట్రాఫిక్‌ను ఎలా నిలువరిస్తారో? అన్నది ఊహకందడం లేదు. నిత్యం లక్ష వాహనాలు ప్రయాణించే 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో సెప్టెంబర్ 2న టోల్ వసూలు ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు ఎలా నిర్వహిస్తారన్నది కూడా గమనించాల్సిన అంశం. ఇటీవల వాహనదారులకు జర్నీ సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్ చెల్లింపు పద్ధతి వల్లనే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాయిదావేసిన హెచ్‌ఎండీఏ అధికారులు...ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్ వసూలులో ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాలి. అప్రమత్తంగా ఉండకపోతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇది మొత్తం నగరంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
అనుమతించకుంటే నిత్యావసరాలపై ప్రభావం...
తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ఉభయగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వేలాది వాహనాల్లో కూరగాయాలు నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్ మార్కెట్లకు సరఫరా అవుతున్నాయి. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి రోజుకు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం ఉండటంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్ ద్వారానే వస్తుండటంతో సెప్టెంబర్ 2న పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు నగర శివారు ప్రాంతాలకు వెళ్లే డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లు కూడా ఇబ్బందికరం కానుంది. నగరంతో పాటు శివార్లలో ఊపందుకున్న నిర్మాణరంగానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక లారీలు కూడా ఓఆర్‌ఆర్ మార్గం ద్వారానే వివిధ జిల్లాల నుంచి రాకపోకలు ఉండటంతో ట్రాఫికర్ గండం రెట్టింపు కానుంది. అయితే ఈ వాహనాలకు ఆ రోజు ఓఆర్‌ఆర్‌పై అనుమతిస్తారా, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతారా అన్నదానిపై అధికారులు ఇప్పటివరకు ఒక నిర్ణయానికి రాకపోవడంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ ఆరోజు ఏ వాహనాలు అనుమతించమని అధికారులు నిర్ణయం తీసుకుంటే నిత్యావసరాలు, సిమెంట్, ఇసుక తదితరాలపై ప్రభావం పడుతుంది.
కొత్త మార్గాల కోసం తవ్వేస్తున్నారు...
అన్ని జిల్లాల నుంచి సభాస్థలికి వచ్చే వాహనాల జర్నీ, పార్కింగ్ సౌలభ్యం కోసం ఓఆర్‌ఆర్ మెయిన్ క్యారేజ్ వే, సర్వీసు రోడ్డు మధ్యలో కొన్ని ప్రాంతాల్లో గుంతలు తవ్వేస్తున్నారు. రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూరు మార్గంలో 15 ప్రాంతాలను పరిశీలించిన అధికారులు చివరకు ఎనిమిది ప్రాంతాల్లో గుంతలు తవ్వి మట్టిరోడ్డు వేస్తున్నారు. అయితే సభ జరిగిన మరుసటిరోజే ఈ మార్గాలను మూసివేసి మళ్లీ యథాతథా స్థితికి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నా అది చేసేందుకు ఎన్ని రోజులు పడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల టోల్ రుసుంకు కూడా గండిపడే అవకాశముండటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగే అస్కారముందని అధికారులే అంటుండడం గమనార్హం.
టోల్ వసూలుపై ఏం చేస్తారో...
158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అంటే గంటకు దాదాపు ఐదు వేల వాహనాలన్నమాట. వరంగల్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి 19 ఇంటర్‌ఛేంజ్‌ల మీదుగా ప్రయాణించే ఈ వాహనాల వల్ల హెచ్‌ఎండీఏకు రోజు ఆదాయం రూ.87 లక్షల వరకు వస్తోంది. అయితే సెప్టెంబర్ 2న సభకు వచ్చే వాహనాల వల్ల ఈ ఆదాయం కాస్తా పెరుగుతుందేమో కానీ ట్రాఫిక్ ఇబ్బందులుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోజు టోల్ ప్రక్రియ నిలిపివేస్తారా...అంటే అదీ హెచ్‌ఎండీఏకు నష్టం కలిగించే అంశం అవుతుంది. కాగ్ ఆడిట్‌లో కూడా తూర్పారపట్టే అవకాశం ఉండటంతో హెచ్‌ఎండీఏ ఆ రోజు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల విషయంలోనూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment