లైసెన్స్‌ లేకపోతే సీజే | Traffic Police Seized Without driving licence Vehicle in Hyderabad | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ లేకపోతే సీజే

Published Mon, May 27 2019 7:20 AM | Last Updated on Fri, May 31 2019 11:57 AM

Traffic Police Seized Without driving licence Vehicle in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్లు, యువకులపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. స్నేహితులు, బంధువుల కార్లు, బైక్‌లను తీసుకుని రయ్యిమంటూ రహదారులపై   దూసుకెళ్తూ ప్రమాదాలకు కారణమైతున్న వారిని కట్టడి చేసి.  ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక డ్రైవ్‌...
ఇందుకుగాను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసే వారిని పట్టుకునేందుకు గల్లీల్లో సైతం తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపే వారిని అడ్డుకుని వాహనాన్ని అక్కడికక్కడే  స్వాధీనం చేసుకుంటున్నారు. సైబరాబాద్‌ పరిధిలో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఏకంగా 4981 కేసులు నమోదుచేశారు.  మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులను పిలిపించి వారితో మరోసారి వాహనాలను నడపనీయమంటూ లిఖితపూర్వకంగా రాయించుకుని వాహనం ఇస్తున్నారు. ఇలా నాలుగు నెలల కాలంలో 782 మైనర్‌ డ్రైవింగ్‌ కేసులు నమోదు చేశారు. మేజర్లపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నారు. అనంతరం. లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నామంటూ దరఖాస్తు నంబరు చూపించిన తర్వాతే వాహనాన్ని ఇస్తున్నారు.   

నేరుగా కోర్టుకే..
డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా  వాహనం నడిపితే నేరుగా కోర్టు మెట్లెక్కాల్సిందే. గతంలో లైసెన్స్‌ లేకుండా  నడిపితే పోలీసులు జరిమానా విధించి వదిలేసేవారు.  అయినా ఫలితం లేకపోవడంతో గత కొద్ది నెలలుగా వాహనాలను స్వాధీనం చేసుకొంటున్నారు. మరుసటి రోజు ఉదయం సదరు చోదకుడు ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని న్యాయస్థానంలో హాజరు కావాలి. వాస్తవానికి మోటార్‌ వాహన చట్టంలో ఇవన్నీ ఉన్నా.. పోలీసులు, రవాణా శాఖ అధికారులు అవసరమైన సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. ప్రమాదాలు తగ్గుతున్నా.. తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులందరూ లైసెన్సును తప్పక దగ్గర ఉంచుకోవాలని  ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కూడళ్ల వద్ద సైన్‌బోర్డుల్లోనూ దీనిపై ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్‌ లేని వారికి జరిమానాను విధిస్తున్నారు.   

ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు..
లైసెన్సు లేకుండా తొలిసారి పోలీసులకు చిక్కితే.. వాహనం స్వాధీనం చేసుకుని కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేస్తారు. కోర్టు సమయం పూర్తయ్యేవరకూ న్యాయస్థానం ప్రాంగణంలోనే నిలబడి ఉండాలి. జరిమానా చెల్లించాలి.
రెండోసారి పోలీసులకు దొరికితే.. 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు.
మూడోసారి చిక్కితే రెండు అంతకంటే ఎక్కువ రోజుల జైలుశిక్షతో పాటు భారీగా జరిమానా చెల్లించాలి. దీని ప్రభావం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే అవకాశాలపై పడుతుంది.
ఐదు, అంతకంటే ఎక్కువసార్లు దొరికితేవారం రోజుల జైలుశిక్ష అనుభవించి.. భారీ జరిమానా చెల్లించక తప్పదు. పోలీసుల నివేదిక అధారంగా కోర్టులు జరిమానా నిర్ణయిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement