‘చోదకా’ తెలుసుకో.. | Traffic rules audio cd release | Sakshi
Sakshi News home page

‘చోదకా’ తెలుసుకో..

Published Sat, Mar 3 2018 8:21 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

Traffic rules audio cd release - Sakshi

పాటల సీడీని ఆవిష్కరిస్తున్న సీపీ వి.వి. శ్రీనివాసరావు ,అత్యాధునిక రికవరీ వాహనం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రహదారులపై ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని నగర పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్‌గా పిలిచే అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు, ఉల్లంఘనలకు పాల్పడితే కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన పాటల సీడీని సీపీ శుక్రవారం ట్రాఫిక్‌ చీఫ్‌ వి.రవీందర్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తెలంగాణ సంస్కృతిక సారథి, భాషా–సాంస్కృతిక శాఖతో కలిసి రూపొందించిన ఈ ఆరు పాటలూ ప్రజల మనస్సుకు హత్తుకునేలా, ట్రాఫిక్‌ నిబంధనలపై వారికి అవగాహన కలిగించేలా ఉన్నాయన్నారు. ప్రాణం విలువ తెలుసుకోవాలంటూ సాగే ఈ పాటలు వాహనచోదకుల్లో అవగాహన పెంచుతాయన్నారు. దేశంలోనే వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా గత ఏడాది విద్యా, ఇతర సంస్థలతో కలిపి 300 ప్రాంతాల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 85 వేల మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిపారు.

దీంతో పాటు ప్రమాదాలు తరచూ ప్రమాదాలు జరుగుతున్న 85 బ్లాక్‌స్పాట్స్‌లో చేపట్టిన ఇంజినీరింగ్‌ మార్పులు ఫలితాలు ఇచ్చాయని, తద్వారా రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 2016 కంటే 2017లో 100 తగ్గిందన్నారు. సరాసరిన 2016లో నెలకు 36 మంది చనిపోగా గతేడాది ఈ సంఖ్య 25కు తగ్గిందని,  మొదటి రెండు నెలల గణాంకాలు పరిశీలిస్తే ఇది ఈ ఏడాది 20కు చేరిందన్నారు. దీన్ని బట్టి ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాదచారుల విషయానికి వస్తే 2016లో సరాసరిన నెలకు 15 మంది మృత్యువాతపడగా, 2017లో ఈ సంఖ్య 11కు తగ్గించగలిగామని, ఈ ఏడాది ఇప్పటి వరకు ఇది కేవలం 6.5గా నమోదైందని ఆయన వివరించారు. ప్రస్తుతం రూపొందించిన ఆరు పాటల సీడీలను ట్రాఫిక్‌ విభాగం అధికారులు కళాశాలలు, పాఠశాలలతో పాటు ఇతర సంస్థల వద్ద పంపిణీ చేయనున్నారు. సామూహిక ఊరేగింపులు, బహిరంగ సభలు ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ ప్రజలకు వినిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఏవీ రంగనాథ్, ఎల్‌ఎస్‌ చౌహాన్‌లతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు. 

‘వెహికిల్‌ ఫ్రెండ్లీ’ క్రేన్‌ ఆవిష్కరణ...
మూడున్నరేళ్లుగా పీపుల్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను చేపడుతున్న నగర పోలీసులు సాధ్యమైనంత వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే స్ఫూర్తితో మరో ముందడుగు వేసిన ట్రాఫిక్‌ విభాగం అధికారులు వెహికిల్‌ ఫ్రెండ్లీ క్రేన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం సీపీ వీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. నో పార్కింగ్‌ ప్రాంతాలతో పాటు క్యారేజ్‌ వేస్‌లో ఆగిన తేలికపాటి వాహనాలను పోలీసు విభాగం టోవింగ్‌ ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తుంది. దీనికోసం ప్రస్తుతం వినియోగిస్తున్న క్రేన్లు కార్లు, జీపులకు ముందు భాగంలో హుక్స్‌ వినియోగించడం ద్వారా తీసుకువెళ్తున్నాయి. ఫలితంగా కొన్ని భాగాలు దెబ్బతినడం జరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు ప్రత్యేకంగా ఓ క్రేన్‌ డిజైన్‌ చేయించారు. ఇది కేవలం కారు/జీపుల ముందు చక్రాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. కేవలం బోల్ట్‌ బిగించడం మినహా మిగిలిన అన్ని ప్రక్రియలూ ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఫలితంగా వాహనానికి ఎలాంటి నష్టం లేకుండా టోవింగ్‌ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ క్రేన్‌ను ఎలాంటి ఇరుకు రోడ్లలోకి అయినా తీసుకువెళ్ళచ్చు. భవిష్యత్తులో ఈ క్రేన్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement