‘ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే సంబంధిత వాహనాలను వేలం వేస్తాం. బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేస్తాం’ ఈనెల 12న జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వైస్‌ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ లోకేష్‌కుమార్ జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌తో కలిసి పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలివి.
‘ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, లారీలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపకండి. ఎక్కువ మొత్తంలో జరిమానా విధిస్తే చాలు’ ఇసుకు నూతన పాలసీపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలవి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నూతన ఇసుక విధానం అమల్లోకి వచ్చిన తరువాత జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడుతుందని అంతా భావించారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను వేలం వేస్తామని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయడంతో ఇసుకాసురుల అక్రమాలకు కళ్లెం పడినట్లేనని అనుకున్నారు. తాజాగా మంత్రి టి.హరీష్‌రావు చేసిన ప్రకటన ఇసుకాసురులకు ఊరట కలిగిస్తోంది. ఇసుక అక్రమ రవాణా చేసే వారిని జైలుకు పంపొద్దని, జరిమానాతో సరిపెట్టండంటూ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. మంత్రి తాజా వ్యాఖ్యలతో ఇసుకాసురుల్లో మళ్లీ నూతన ఉత్సాహం వచ్చింది. యథేచ్ఛగా ఇసుకను జిల్లా సరిహిద్దులు దాటించేందుకు సిద్ధమవుతున్నారు.
అధికారుల అండదండలతో
చెక్‌పోస్టులు దాటుతున్న వాహనాలు
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లాలో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అయితే ఆయా చెక్‌పోస్టులు అక్రమ రవాణాకు నిలయాలుగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్, పెద్దపల్లి, గోదావరిఖని, జగిత్యాల డివిజన్లలో పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచే సగటున 200 లారీల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. కరీంనగర్ సమీపంలోని అల్గునూరులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినప్పటికీ, రాత్రిపూట ఇసుక రవాణాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ అధికారులు అండదండలు, కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అర్ధరాత్రి వందల కొద్ది లారీలు చెక్‌పోస్టులు దాటుతున్నారుు.
అల్గునూరుతోపాటు మిగిలిన చెక్‌పోస్టుల వద్ద సైతం దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇసుక లారీల యజమానులు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకుని తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. నకిలీ వే బిల్లులు సృష్టించడంతోపాటు అధికారులు జారీ చేసిన వే బిల్లుల్లో తేదీలను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో వే బిల్లుల్లో అక్రమాలను పసిగట్టిన పోలీసులు అల్గునూరు చెక్‌పోస్టు వద్ద ఏడు లారీలను పట్టుకున్నప్పటికీ ఆ తరువాత ఏమైందో ఏమోగానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే రైట్ చెప్పేశారు. ఇసుక లారీలను వదిలిపెట్టేందుకు లారీల యజమానులతో ముందుగానే అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఒక్కో లారీకి వెయ్యి నుంచి రూ.3వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల సహకారంతో ఇసుకాసురులు కొత్త అవతారాలెత్తుతున్నారు. బొగ్గు లారీలకు అతికించే స్టిక్కర్లను డూప్లికేట్‌గా ముద్రించి ఇసుక లారీలకు అంటిస్తున్నారు. చెక్‌పోస్టు సిబ్బందితో ముందుగానే కుమ్మక్కు కావడంతో వారు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పైనుంచి ఆదేశాలు వచ్చిన సమయంలో మాత్రం లారీలను పట్టుకుని జరిమానా విధిస్తున్నారు.
జీవో5 కాగితాలకే పరిమితమా?
ఇసుక మాఫీయాపై ఉక్కుపాదం మోపడానికి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 5ను జారీ చేసింది. గతంలో ఇసుక అక్రమ రవాణ చేసే వాహనాలను పోలీసులు పట్టుకుని రెవెన్యూ విభాగానికి అప్పగించేవారు. అనంతరం జరిమానాతో సరిపెట్టేవారు. ఒకవేళ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేస్తే ఇసుక చోరీ కేసులు నమోదు చేసేవారు. అయితే ఇవి చాలా తక్కువ సందర్బాల్లో నమోదు అయ్యేవి. వీటిలో ఎక్కువభాగం నేతల అనుచరులకు చెందినవి కావడంతో తూతూమంత్రంగా జరిమానా వేసి వదిలివేసేవారు. వీటికి జీవో నంబర్ 5 ముక్కుతాడు వేసినట్లయింది.
ఈ జీవో ప్రకారం ఇసుక అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్, లారీలను ఏకంగా వేలం వేస్తారు. అట్లాగే అక్రమ రవాణా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అయినా వారిలో మార్పు రానిపక్షంలో అవసరమైతే వారిపై రౌడీషీట్ కూడా తెరవొచ్చని జీవోలో పేర్కొన్నారు. అయితే తాజాగా సంబంధిత శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు సదరు జీవోను నీరుకార్చేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు వద్దని కేవలం జరిమానాతో వదిలివేయాలని సూచించడంతో పరోక్షంగా ఇసుక అక్రమ రవాణాకు ఊతం ఇచ్చినట్లయిందని అధికారులే అభిప్రాయపడుతున్నారు. మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించడంతో అధికారుల జీవోను తు.చ. తప్పకుండా అమలు చేసే అవకాశాలే లేవని చెబుతున్నారు.
అక్రమ రవాణా ఆగేదెలా?
Published Thu, Feb 19 2015 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement
Advertisement