25 తర్వాత గజ్వేల్‌కు రైలు | Train To Gajwel After 25th June | Sakshi
Sakshi News home page

25 తర్వాత గజ్వేల్‌కు రైలు

Published Tue, Jun 2 2020 3:08 AM | Last Updated on Tue, Jun 2 2020 4:59 AM

Train To Gajwel After 25th June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ నుంచి గజ్వేల్‌కు ఈ నెలాఖరుకు రైలు సేవలు ప్రారంభం కాబోతున్నాయి. పనులన్నీ పూర్తి కావటం తో ఈనెల 8న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేయబోతున్నారు. ఆరోజు పూర్తి స్థాయి రైలును గరిష్ట వేగంతో నడిపి పరీక్షిస్తారు. ఈ సందర్భంగా సాంకేతికంగా వెలుగు చూసే లోపాలకు సంబంధించి రైల్వే సేఫ్టీ కమిషనర్‌ స్థానిక అధికారులకు సూచనలు చేస్తారు. వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో రైలు సేవలు ప్రారంభమవుతాయి. ఈనెల 25 తర్వాత సుముహూర్తం చూసి రైలు సేవలకు పచ్చజెండా ఊపనున్నారు. ప్రస్తుతానికి సింగిల్‌ లైన్‌గా ఉన్న ఈ మార్గంలో డీజిల్‌ లోకోమోటివ్‌తో రైలు తిరగనుంది. మెమూ తరహా రైళ్లను నడిపే అవకాశముంది. ఐదేళ్ల కాలంలో దీన్ని విద్యుదీకరించే అవకాశం కనిపిస్తోంది. 

అంతా సిద్ధం.. లాక్‌డౌన్‌తో జాప్యం
గత మార్చిలోనే రైలు సేవలు ప్రారంభించేందుకు వీలుగా రైల్వే శాఖ వేగంగా పనులు పూర్తి చేసింది. సరిగ్గా రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేసే వేళ లాక్‌డౌన్‌ మొదలైంది. ఇది రెండు నెలలపాటు నిరవధికంగా కొనసాగటంతో దీర్ఘకాలం వాయిదా పడాల్సి వచ్చింది. ఇప్పుడు అన్‌లాక్‌తో తనిఖీకి ముహూర్తం ఖరారు చేశారు. ట్రాక్, స్టేషన్‌ భవనాలు, ప్లాట్‌ఫారాలు, వంతెనలు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

3 కొత్త స్టేషన్లు..
మేడ్చల్‌ సమీపంలోని నిజామాబాద్‌ రైల్వేలైన్‌పై ఉన్న మనోహరాబాద్‌ నుంచి ఈ కొత్త లైన్‌ ప్రారంభమవుతుంది. అక్కడ కొత్తలైన్‌పై స్టేషన్‌ భవనం సిద్ధం చేశారు. ఆ తర్వాత నాచారం స్టేషన్‌ వస్తుంది. అక్కడ భవనం, ప్లాట్‌ఫారాలు సిద్ధమయ్యాయి. ఆ తర్వాత బేగంపేట స్టేషన్‌ వస్తుంది. అక్కడ కూడా పనులన్నీ పూర్తయ్యాయి. తర్వాత గజ్వేల్‌ స్టేషన్‌ ఉంటుంది. అది కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక ఈ మార్గంలోనే 4 పెద్ద వంతెనలు నిర్మించారు. రామాయపల్లి, గన్‌పూర్, నాచారం, అప్పాయపల్లి దాటాక ఇవి నిర్మితమయ్యాయి. నాచారం వద్ద హల్దియా నదిపై వంతెన నిర్మించగా, మిగతా 3 చెరువులకు సంబంధించిన వాగులపై కట్టారు. 

ఆర్‌ఓబీలు 6, ఆర్‌యూబీలు 3
ఇక ఈ మార్గంలో మనోహరాబాద్, నాచారం స్టేషన్‌ వద్ద, నర్సాయపల్లి గ్రామం దాటాక ఉన్న తండా వద్ద, లింబినాయక్‌ తండా, బేగంపేట దగ్గర మల్కాపూర్‌ రోడ్డు వద్ద, ఎల్కంటి గ్రామం వద్ద 6 పెద్ద    ఆర్‌ఓబీలు సిద్ధం చేశారు. తూప్రాన్‌ వద్ద జాతీయ రహదారి దిగువన, గజ్వేల్‌–బేగంపేట రోడ్డు, గజ్వేల్‌–దౌల్తాబాద్‌ రోడ్డు వద్ద 3 పెద్ద ఆర్‌యూబీలు సిద్ధమయ్యాయి. ఇవి కాకుండా 45 చిన్న వంతెనలు నిర్మించారు. 

ఇది ప్రాజెక్టు స్వరూపం:
మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు

అంచనా వ్యయం: రూ.1,160 కోట్లు

ఇందులో కేంద్రం వాటా మూడింట రెండో వంతు, మిగతా ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీనితోపాటు భూసేకరణ, మౌలిక వసతుల వ్యయం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది యాన్యుటీ పద్ధతిలో నిర్మించే ప్రాజెక్టు అయినందున, ఒకవేళ నష్టాలు వస్తే.. ఐదేళ్లపాటు ఆ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 

నాలుగు దశల్లో ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. ఇందులో తొలి దశగా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు 32 కి.మీ. మేర రైలు నడిపేందుకు సిద్ధమైంది. 

ఆ తర్వాత గజ్వేల్‌–దుద్దెడ (33 కి.మీ.), దుద్దెడ–సిరిసిల్ల (48 కి.మీ.), సిరిసిల్ల–కొత్తపల్లి (38 కి.మీ.) పనులు జరుగుతాయి.

మూడో దశ వరకు భూసేకరణ పూర్తయింది. రెండో దశలో ఎర్త్‌ వర్క్, వంతెనల పనులు జరుగుతున్నాయి. 

2016లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గజ్వేల్‌లో పనులకు శంకుస్థాపన చేశారు. 

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో పూర్తిస్థాయిలో కొత్త రైల్వే ప్రాజెక్టుగా ఇది సిద్ధం కాబోతోంది. ఇందులో తొలి దశ ఇప్పుడు ప్రారంభోత్సవానికి రెడీ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement