బదిలీల ఏర్పాట్లలో డీఈవో కార్యాలయ ఉద్యోగులు
ఆదిలాబాద్‌టౌన్ : ఉపాధ్యాయ బదిలీల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సినియారిటీ, ఖాళీల జాబితాను ఇప్పటికే సిద్ధంచేశారు. ప్రభుత్వం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. బుధవారం షెడ్యూల్ విడుదల అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే బదిలీలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చేపట్టనున్నారు. దాదాపు 5వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన ఖాళీల జాబితా, తప్పనిసరి బదిలీ టీచర్ల వివరాలను ఆదిలాబాద్ డీఈవోకు సమర్పించారు. బదిలీలను వెబ్ కౌన్సెలింగా లేక.. మ్యాన్‌వల్‌లో చేపడుతారో తెలియక ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత తుది జాబితాను విడుదల చేయనున్నారు. అయితే గతంలో 2015 సంవత్సరంలో బదిలీల ప్రక్రియ జరిగింది. దూర ప్రాంతాలు, మండలాల్లో ఉన్న ఉపాధాయయులు బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన..
ఉపాధ్యాయ బదిలీలను ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని టీచర్ల ఖాళీలను షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ప్రకటించనున్నారు. అలాగే అయా పాఠశాలల్లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా స్థాన చలనం జరుగనుంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5వేల మందికి బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాల వారీగా..
-
ఆదిలాబాద్ జిల్లాలో 3,176 మంజూరు పోస్టులు కాగా ప్రస్తుతం 2,669 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 509 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని తప్పని సరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు 685 మంది ఉన్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 12 మంది ఉన్నారు.
మంచిర్యాల జిల్లాలో మంజూరు పోస్టులు 2,854 ఉన్నాయి. ప్రస్తుతం 2,547 మంది పనిచేస్తున్నారు. ఎనిమిది, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 801 మంది ఉన్నారు. అలాగే 300 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వ్యాప్తంగా మొత్తం 2,228 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు 2421 ఉన్నారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1048 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎనిమిది, ఐదేళ్ల సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 288 మంది ఉన్నారు.
నిర్మల్ జిల్లాలో 317 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఐదు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 647 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.
ఇలా ఉమ్మడి జిల్లాబదిలీల కోసం ఎదురుచూపు..
గత కొన్నేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుమూల మండలాల్లో, భార్యభార్తలు వేరువేరు చోట ఉండి పనిచేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ షెడ్యూల్ కోసం అలాంటి వారు ఆశగా ఎదరుచూస్తున్నారు. అయితే అత్యధికంగా కుమురంభీం జిల్లాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఖాళీల కోసం ఎదురుచూస్తున్నారు. దహెగాం, బెజ్జూరు, కౌటల, తిర్యాణి, భీమిని తదితర మండలాల్లో పనిచేస్తున్నవారు మైదాన ప్రాంతంలోకి బదిలీపై వెళ్లేందుకు అసక్తి చూపుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ తర్వాత విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment