చెన్నూర్ : చెన్నూర్ సమీపంలోని పలుగుల వద్ద గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఆదిలాబాద్-కరీంనగర్-వరంగల్ జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. దీంతో మూడు జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా జిల్లాల మధ్య దూరభారంతోపాటు సమయం, వ్యయం భారం తగ్గుతుంది. గోదావరి నదిపై వంతెన నిర్మించాల్సి ఉన్నా గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నిర్మాణానికి మోక్షం కలగలేదు.
ఫలితంగా మూడు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం గోదావరిపై వారధి నిర్మాణం చేపడుతుందని ప్రజలు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. చెన్నూర్ నుంచి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యలో గోదావరిపై వంతెన లేక పోవడంతో గోదావరిఖని మీదుగా ప్రయాణిస్తే 125 కిలో మీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. గోదావరిపై వంతెన నిర్మాణం చేపడితే ఈ ప్రాంత రైతులకు వరంగల్ మార్కెట్ దగ్గరవుతుంది. ఆదిలాబాద్-కరీంనగర్ అంతర్ జిల్లాల వంతెన నిర్మాణం ద్వారా మూడు జిల్లాల ప్రజలకు మేలు చేకూరుతుంది.
మంచిర్యాల నుంచి వరంగల్‌కు 140 కి.మీ.
చెన్నూర్ వద్ద గల గోదావరిపై వంతెన నిర్మిస్తే మంచిర్యాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం 52 కిలో మీటర్లు, వరంగల్ 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మంచిర్యాల నుంచి వయా గోదావరిఖని మీదుగా కాళేశ్వరం 107, వరంగల్ 180 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ లెక్కన 40 కిలో మీటర్ల దూరం గంటపాటు సమయంతోపాటు వ్యయం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా శ్రీరాంపూర్, మందమర్రి, చెన్నూర్ ఇందారం, బెల్లంపల్లి పట్టణాల నుంచి భూపాల్‌పల్లికి నిత్యం వందలాది మంది సింగరేణి కార్మికులు రాక పోకలు సాగిస్తుంటారు. ప్రభుత్వం చెన్నూర్ గోదావరిపై వంతెన నిర్మిస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
మూడు జిల్లాల్లో పుణ్య క్షేత్రాలు
ఆదిలాబాద్ జిల్లాలో బాసర, కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం, వరంగల్ జిల్లా వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి లాంటి పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్య క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ మూడు జిల్లాలను దగ్గర చేసేందుకు గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెన నిర్మాణం చేపట్టాలి..
- పర్స శ్రీనివాస్‌రావు, విద్యావంతుల వేదిక, జిల్లా నాయకులు
చెన్నూర్, కాళేశ్వరం మధ్య ఉన్న గోదావరిపై వంతెన నిర్మించాలి. వంతెన నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తాం. తెలంగాణ విద్యా వంతుల వేదిక అధ్వర్యంలో వంతెన నిర్మాణం చేపట్టాలని కరపత్రాలు సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదెలుతో కలసి కేసీఆర్‌ను కలుస్తాం. వంతెన నిర్మాణానికి కృషి చేయాల్సిందిగా కోరుతాం.
వారధితో మేలు
Published Thu, Jul 10 2014 2:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement