ఆర్టీసీకి స్వర్ణయుగం | Transport Minister Puvvada Ajay Kumar With Sakshi | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి స్వర్ణయుగం

Published Sat, Dec 14 2019 1:55 AM | Last Updated on Sat, Dec 14 2019 5:00 AM

Transport Minister Puvvada Ajay Kumar With Sakshi

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘ఘనత సాధించాలంటే కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించి ముందుకెళ్తూ.. లోటు పాట్లు, లోపాలను సరిదిద్దినప్పుడు అద్భుతం ఆవిష్కృతమ వుతుంది. ఆర్టీసీ విషయంలో అదే జరిగింది. మొన్నటి సమ్మె ఆర్టీసీని గొప్ప సంస్థగా మార్చబోతోంది. నిజానికిది ఆర్టీసీకి ఇది స్వర్ణయుగం. ఇంతకాలం అప్పులు, నష్టాల కుప్పగా ఉన్న సంస్థ.. వాటి నుంచి బయటపడే సమయం మొదలైంది’’అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, సంస్థ గురించి తెలుసుకునేలోపే సమ్మె వచ్చింది. రెండు నెలలపా టు సమ్మె ప్రత్యామ్నాయ చర్యల గురించి తప్ప సంస్థ గురించి ఆలోచించే పరిస్థితే లేదు. ఇప్పుడు అన్నీ కొలిక్కి రావడంతో ఆర్టీసీ పై దృష్టి సారించారు. ఇన్ని రోజులు పేరుకుపోయిన ఫైళ్లను శుక్రవారమే తెరిచారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...

అతలాకుతలం నుంచి ప్రగతి వైపు 
సాధారణంగా బస్సు చార్జీలు పెంచితే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. దీంతో రెండు నెలల అతలాకుతల పరిస్థితి నుంచి వెంటనే ఆర్టీసీ ప్రగతి బాట పట్టింది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం దాటుతోంది. కొద్దిరోజుల్లో 72 శాతాన్ని అధిగమించి చరిత్ర సృష్టించనుంది. సీఎం సూచన మేరకు కొత్తగా వెల్ఫేర్‌ కౌన్సిల్స్‌ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏ డిపోకు వెళ్లినా ఉద్యోగులు ఉత్సాహంగా, సంతోషంగా విధుల్లోకి వస్తున్నారు. వారిలో విప్లవాత్మక మార్పు వచ్చింది. గైర్హాజరీ గల్లంతైంది. సమయపాలన పెరిగింది. సిన్సియర్‌గా అన్ని ట్రిప్పులు తిప్పుతున్నారు. డిపో స్థాయిలో ఓ ఫిర్యాదుల బాక్సు ఏర్పాటుచేస్తాం. ఉద్యోగులు ఫిర్యాదులను రాసి అందులో వేస్తే రోజూ 11 గంటలకల్లా వెల్ఫేర్‌ కౌన్సిల్‌ సభ్యులు చూసి డీఎంతో మాట్లాడి మధ్యా హ్నం 3 గంటల్లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.

ఆదాయం పెరిగింది.. 
సమ్మెకు ముందు సంస్థ రోజువారీ ఆదాయం రూ.11 కోట్లు, ఖర్చు రూ.13 కోట్లు. ఇప్పుడు రోజువారీ ఆదాయం రూ.13 కోట్లకు చేరింది. ఇక కార్మిక సహకార పరపతి సంఘం (సీసీఎస్‌), పీఎఫ్‌లకు సంబంధించిన బకాయిలను కోర్టు సూచన మేరకు విడతలవారీగా తీర్చేస్తాం. కొన్ని ఏసీ బస్సు ల్లో బెర్తులు ఏర్పాటు చేసి దూర ప్రాంతాలకు స్లీపర్‌ బస్సు లుగా తిప్పుతాం. తొలుత 25 బస్సులతో ప్రారంభిస్తాం.

నగరంలో బస్సుల సంఖ్య తగ్గించినా, ఉన్నవాటిని హేతుబద్ధీకరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. పాత బస్సులను తొలగించి వాటి బాడీని మార్చి సరుకు రవాణా ప్రారంభిస్తున్నాం. పార్శిల్‌ సర్వీసును బలోపేతం చేస్తాం. ఈ రూపంలో ఆర్టీసీకి సాలీనా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం.

ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి 
ఆర్టీసీని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. సమ్మె తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. సీఎం కూడా ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఇకపై ఆయన క్రమం తప్పకుండా ఆర్టీసీపై దృష్టి సారిస్తారు. కొత్త ఆలోచనలతో సూచనలు చేస్తున్నారు.

కేసీఆరే అంబాసిడర్‌.. 
సమ్మె ముగిసిన వెంటనే ఖమ్మంలో ఆర్టీసీ డిపోకు వెళ్లి ఖాకీ చొక్కా వేసుకుని ఓ బస్సును అలా బయట వరకు నడిపా. స్టీరింగ్‌ ముందు కూర్చుని ఉద్వేగానికి లోనయ్యా. మరి సంస్థ ఉద్యోగులుగా ఉండి ఉద్యోగం చేయటానికి ఇబ్బంది పడేవారిని ఏమనాలి? అలా కొందరు పనిచేయక, ఇతర ఉద్యోగులను పని చేయిం చనీయక పక్కదారి పట్టించారు. ఆ తీరు మారాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన. ఇప్పుడదే జరిగింది. అంతా సంతోషంగా పని ప్రారంభించారు. దేశంలోనే గొప్ప రవాణా సంస్థగా ఆర్టీసీ ఎదుగుతుంది. అందుకే దీని బ్రాండ్‌ అంబాసిడర్‌ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement