సాక్షి, వరంగల్ రూరల్: గిరిజన సైనిక్ స్కూల్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి అధికారికంగా తరగతులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో ఈ స్కూలును ఏర్పాటు చేశారు. రూ.1.24 కోట్లతో భవనాలను ఆధునీకరిస్తున్నారు. ఇటీవల నూతన భవనాల నిర్మాణం కోసం మరోసారి ప్రభుత్వం రూ.2.5 కోట్లను మంజూరు చేయగా ఆ పనులు సైతం చురుకుగా సాగుతున్నాయి.
దాదాపుగా పనులు పూర్తి కావస్తున్నాయి. కాగా, సైనిక్ స్కూల్‌లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపికను పూర్తి చేశారు. రాష్ట్రంలోని టీటీడబ్ల్యూఆర్‌ఎస్ పాఠశాలలు, కళాశాలల నుంచి వీరిని ఎంపిక చేశారు. 5వ తరగతి కోసం రాష్ట్రవ్యాప్తంగా 250 మంది హాజరుకాగా 80 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు 280 మంది వరకు హాజరుకాగా ఇందులో నుంచి 80 మందిని ఎంపిక చేసి వారి జాబితాను గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు పంపారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చే ఆర్మీ రిటైర్డ్ అధికారుల కోసం కూడా బుధవారం హైదరాబాద్‌లో ఎంపిక నిర్వహించినట్లు తెలిసింది. త్వరలో స్కూల్‌లో బోధించేందుకు అధ్యాపకుల ఎంపిక సైతం పూర్తి కానుంది. అధ్యాపకులు, ఇతర సిబ్బందిని ఈ నెల 10వ తేదీ వరకు ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment