లొద్దిగూడ గ్రామం నుంచి గర్భిణిని పీహెచ్‌సీకి తీసుకెళ్తున్న ఏఎన్‌ఎం
నార్నూర్(ఆసిఫాబాద్): ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఓ గర్భిణి పురిటి నొప్పులతో ప్రసవ వేదన అనుభవించింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం డాబా–బి గ్రామపంచాయతీ పరిధిలోని పావునూర్ లొద్దిగూడ గ్రామానికి చెందిన సిడాం జంగుబాయికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆమెను ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడానికి సరైన రోడ్డు లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏమి చేయాలో అర్థం కాక పావునూర్ గ్రామ యువకుడి సాయంతో ఏఎన్‌ఎం శ్రీదేవికి ఫోన్‌లో సమాచారం అందించారు. వర్షాకాలంలో గ్రామానికి కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని పరిస్థితి. అయినా ఏఎన్‌ఎం శ్రీదేవి డాబా–బీ నుంచి పావునూర్ లొద్దిగూడకు దాదాపు 12 కిలో మీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఏఎన్‌ఎం ఇంట్లోనే పురుడు పోశారు.
ఆడపిల్లకు జన్మనిచ్చిన తర్వాత మహిళకు రక్తస్రావం బాగా జరగడంతో మెరుగైన వైద్యం కోసం ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి నానా తంటాలు పడ్డారు. లొద్దిగూడ నుంచి 12కి.మీ. దూరంలో ఉన్న డాబా వరకు ఎడ్లబండిపై తీసుకొచ్చి..అక్కడి నుంచి 108లో ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. పావునూర్ లొద్దిగూడలో మొత్తం 30 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నప్పటికీ గ్రామానికి కనీసం రోడ్డు మార్గం లేదు. రోడ్డు కోసం గత పదేళ్లుగా పాలకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment